నో ఆప్షన్: డెబిట్ లేదా క్రెడిట్ కార్డు జనవరిలోపు మార్చుకోవాల్సిందే

By sivanagaprasad kodatiFirst Published Nov 25, 2018, 10:59 AM IST
Highlights

బ్యాంకుల ఖాతాదారులు వచ్చేనెలాఖరులోగా తమ డెబిట్, క్రెడిట్ కార్డులను ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత కార్డులుగా మార్చుకోవాలని సదరు బ్యాంకర్లు కోరుతున్నాయి. 2015లోనే బ్యాంకులన్నింటినీ ఆర్బీఐ ఆదేశించినా మూడేళ్లకు పైగా గడువు ఇచ్చింది. 

నూతన సంవత్సరంలో అంటే వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి నుంచి కొన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు పనిచేయకపోవచ్చు. ఇంతకుముందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన సూచనల ప్రకారం వచ్చే నెలాఖరు లోగా ఇప్పుడు ఉన్న మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులన్నీ ఈఎంవీ చిప్, పిన్ (పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఆధారిత కార్డులుగా మారాల్సి ఉన్నది.

ఈ కొత్త ఈఎంవీ కార్డులు మరింత భద్రతా ప్రమాణాలతో రానుండటంతో ఎలాంటి మోసాలకు తావుండదని ఆర్బీఐ చెబుతున్నది. 2015 ఆగస్టు 27వ తేదీన కార్డుల మార్పిడికి బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసినా మూడేండ్లకుపైగా గడువిచ్చింది.

2015 సెప్టెంబర్ 1 నుంచి ఖతాదారులకు జారీ చేసే  దేశీయ, అంతర్జాతీయ డెబిట్, క్రెడిట్ కార్డులన్నీ ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత కార్డులై ఉండాలని బ్యాంకులకు సదరు సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఖాతాదారులకు తమ కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిందిగా బ్యాంకులూ తరచూ సందేశాలను పంపుతూనే ఉన్నాయి.

ఈఎంవీ అంటే..
యూరోపే, మాస్టర్‌కార్డ్, వీసాను ఈఎంవీగా పరిగణిస్తారు. డెబిట్, క్రెడిట్ కార్డు భద్రతలో ఇది ఓ ఆధునిక చిప్ కార్డ్ సెక్యూరిటీ. దీనివల్ల మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారులకు రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ కొనుగోళ్లలో, డిజిటల్ పేమెంట్లలో అక్రమాలకు అవకాశం ఉండదు. అంతేగాక ఈ కార్డులు ఎక్కడైనా పోయినా, దొంగిలించబడినా పెద్దగా నష్టం ఉండదు. ఇదే సమయంలో వ్యక్తిగత పిన్ నెంబర్ కూడా మనకు లాభిస్తుంది.

మీది ఈఎంవీ కార్డేనా..
బ్యాంక్ ఖాతాదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డులు ఈఎంవీ కార్డులేనా? అని చెక్ చేసుకోవడం చాలా సులభం. ఈఎంవీ కార్డుల ముందు భాగంలో బంగారు వర్ణం (గోల్డెన్)లో చిప్‌లు ఉంటాయి. చాలావరకు ఇవి కార్డుకు ఎడమవైపున కనిపిస్తాయి.

ఎలా మార్చుకోవాలి?
నెట్-బ్యాంకింగ్ ద్వారానైనా, మీకు ఖాతా ఉన్న బ్యాంక్ శాఖ వద్దకు వళ్లైనా మీమీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులను కొత్త ఈఎంవీ కార్డులుగా మార్చుకోవచ్చు. బ్యాంకుల వద్ద మీరు నమోదు చేసుకున్న మీ చిరునామాలకు వీటిని పంపడం జరుగుతుంది.
 

click me!