వసతుల్లేవ్.. తక్కువ వేతనాలే: అమెజాన్‌ ‘బ్లాక్‌ఫ్రైడే’ సిబ్బంది షాక్!

By narsimha lodeFirst Published Nov 25, 2018, 10:38 AM IST
Highlights

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌కు బ్లాక్‌ఫ్రైడే ఉద్యోగులు షాకిచ్చారు

వాషింగ్టన్‌: ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌కు బ్లాక్‌ఫ్రైడే ఉద్యోగులు షాకిచ్చారు. ‘థాంక్స్‌ గివింగ్‌ డే’ తర్వాత వచ్చే శుక్రవారం బ్లాక్‌ఫ్రైడేగా చేసుకొంటారు. ఆరోజు పలు దుకాణాలు వినియోగదారులకు భారీ ఆఫర్లను ప్రకటిస్తాయి. దీంతో జనాలు కూడా విరగబడి కొనుగోళ్లు జరుపుతారు. ఒక పక్క బ్లాక్‌ఫ్రైడేకు అమెజాన్‌ భారీ డీల్స్‌ ప్రకటిస్తుంటే ఆ కంపెనీ గోడౌన్లలో పనిచేసే ఉద్యోగులు మాత్రం ఆందోళనకు దిగారు.

సంస్థలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొంటూ ఐరోపా దేశాల్లోని పలు అమెజాన్‌ కార్యాలయాల్లో ఆందోళనకు దిగారు. ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌, యూకేల్లో అమెజాన్‌ కార్యకలాపాలు ఈ ఆందోళనలతో ప్రభావితమయ్యాయి. 

బ్రిటన్‌లోని జీఎంబీ కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ దేశంలోని ఐదు చోట్ల వందల మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. సంఘ కార్యదర్శి టిమ్‌ రోచే మాట్లాడుతూ ‘మా సంఘ సభ్యులు అమెజాన్‌లో ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారు. వారు పడిపోతే ఎముకలు విరుగుతాయి, స్పృహ తప్పుతారు, వారిని అంబులెన్స్‌లో తరలిస్తారు’ అని పేర్కొన్నారు.

‘సాధారణ రోజుల్లో కంపెనీ మా అభ్యర్థనలను పెడచెవిన పెడుతుండటంతో.. అమ్మకాలు బాగా ఉండే రోజుల్లో ఆందోళనలు చేపడుతున్నాం’ అని అమెజాన్ ఉద్యోగులు చెబుతున్నారు. జర్మనీలో 600 ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కార్మికుల ఆరోపణలకు తగినట్లే బ్రిటన్‌లోని ‘ఫస్ట్‌ రెస్పాండర్స్‌’కు గత మూడేళ్లలో అమెజాన్‌ నుంచి 600 సార్లు అంబులెన్స్‌ కోసం ఫోన్‌కాల్స్‌ వచ్చాయి.

కార్మికుల ఆందోళనపై అమెజాన్‌ స్పందించలేదు. యూరప్‌లో తమ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని.. వినియోగదారులపైనే తమ దృష్టి ఉందని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆందోళనలపై వచ్చిన వార్తలు తప్పని పేర్కొంది. 2010 నుంచి 75,000 ఉద్యోగాలను ఐరోపాలో సృష్టించామని చెప్పుకొచ్చింది. 

వీరందరికి మంచి వేతనాలు కూడా చెల్లిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. తమ ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలను ఎవరైనా పరిశీలించేందుకు వస్తే తీసుకెళతామని కూడా పేర్కొంది. యూరప్‌లో బ్లాక్‌ ఫ్రైడే ఒక్కరోజే దాదాపు 2బిలియన్‌ డాలర్లకు పైగా విక్రయాలు జరిగినట్లు అంచనా.

click me!