రూ. 8,126 కోట్లు: క్యూ4 లాభాల్లో టాప్ లేపిన టీసీఎస్

By rajesh yFirst Published Apr 12, 2019, 6:05 PM IST
Highlights

దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మార్చి(2019)తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 17.70శాతం పెరుగుదలతో రూ.8,126 కోట్లకు చేరుకుంది.

ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మార్చి(2019)తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 17.70శాతం పెరుగుదలతో రూ.8,126 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ వర్గాలు కంపెనీ నికర లాభం రూ.7,981 కోట్లు ఉండొచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రస్తుతం టీసీఎస్ ప్రకటించిన లాభాలు వారి అంచనాలను మించిపోయాయి. కంపెనీ 2017-18 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 6,904కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 

‘గత 15 త్రైమాసికాల్లోకెల్లా ఇవే మేము సాధించిన అత్యుత్తమ క్వార్టర్ ఫలితాలు. ఈ త్రైమాసికంలోనే బలమైన ఆదాయ వృద్ధి సాధించాం. గత మూడు త్రైమాసికాల కంటే ఇప్పుడు ఆర్డర్ బుక్ విలువ కూడా ఎక్కువగా ఉంది. ముందు స్థూల అనిశ్చుతులున్నప్పటికీ ఈ ఫలితాలు సాధించడం గొప్ప విషయం. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఇది శుభసూచకం’ అని టీసీఎస్ ఎండీ, సీఈఓ రాజేశ్ గోపినాథన్ వెల్లడించారు.  

ఇక కంపెనీ సేల్స్ ఈ క్యూ4లో 18.5శాతం పెరుగుదలతో ఆదాయం రూ.38,010కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కంపెనీ ఆదాయం రూ. 32,075 కోట్లుగా ఉంది.

కాగా, కంపెనీ నిర్వహణ ప్రాఫిట్ మార్జిన్ 25.1శాతంగా ఉంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 31 బేసిస్ పాయింట్లు తగ్గింది. కంపెనీ అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 18 తుది డివిడెండ్ ప్రకటించింది.
 

click me!