ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తుండడం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టాటా సైతం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. అన్ని దిగ్గజ కంపెనీలు ఈవీ వాహనాల తయారీలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పటికే హోండా, టీవీఎస్ వంటి సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను తీసుకొస్తూ ఈవీ రంగంలో దూసుకుపోతున్న టాటా ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ రంగరంలోకి కూడా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎలాంటి అధికారిక ప్రకటన లేదు..
ఎలక్ట్రిక్ బైక్ తయారీ మార్కెట్లోకి టాటా ప్రవేశిస్తున్న తరుణంలో పట్టణ రవాణాను పునర్మించడంలో కచ్చితంగా ఇది ఒక కీలక అడుగుగా మార్కెట్ వర్గాలు అభిప్రాయాపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు టాటా మోటార్స్ ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈ బైక్‌కు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమాచారం ఆధారంగా టాటా ప్రవేశపెడుతోన్న ఈవీ బైక్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీచర్స్ ఇలా.?
టాటా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ బైక్ గరిష్టంగా గంటకు 80 నుంచి 100 కి.మీల వేగంతో దూసుకెళ్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 నుంచి 200 కి.మీల రేంజ్‌ను అందిస్తు్ందని తెలుస్తోంది. ఇక బైక్ కేవలం గంటలోనే 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుందని సమాచారం. అలాగే టాటా ఈవీ బైక్ సుమారు 3-5 kW పవర్ అవుట్‌పుట్‌తో మిడ్-డ్రైవ్ మోటార్‌తో రానుందని వార్తలు వస్తున్నాయి.
ఇవీ ప్రత్యేకతలు..
ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో ముందు వరుసలో నిలవాలనే టార్గెట్‌తో ఉన్న టాటా మోటార్స్ తొలి ఈవీ బైక్‌లో అధునాతన ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో పాటు విభిన్న పరిస్థితులకు అనుగుణంగా మల్టీ రైడింగ్ మోడ్ వంటి ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. టాటా స్వయంగా అభివృద్ధి చేసిన బ్యాటరీ టెక్నాలజీని ఇందుకోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇక ధరకు సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి. వీటి ప్రకారం టాటా ఈవీ బైక్ రూ. 80,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఛార్జింగ్ స్టేషన్స్ కూడా..
ఈవీ బైక్‌లతో పాటు వాటికి అవసరమయ్యే ఛార్జింగ్ స్టేషన్‌ల విషయంలో కూడా టాటా కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టాటా పవర్ ఆర్మ్ ద్వారా ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వేగవంతం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే టాటా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను విస్తరించే పనిలో ఉందని తెలిసిందే. భవిష్యత్తులో ఈ కంపెనీ నుంచి రానున్న ఈవీ టూవీలర్స్‌కు అనుగుణంగా మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.