Air India: టాటా చేతికి వెళ్లాక లాభాల బాటపట్టిన ఎయిర్ ఇండియా.. FY25లో రూ.61,000 కోట్లు ఆదాయం

Published : Jun 08, 2025, 10:21 PM IST
Air India

సారాంశం

Air India: ఎయిర్ ఇండియా FY25లో రూ.61,000 కోట్లు ఆదాయం, 44 మిలియన్ ప్రయాణికులతో 9.9% వృద్ధి సాధించింది. విహాన్.ఏఐ ప్రోగ్రామ్ మంచి ఫలితాలను ఇచ్చిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Air India: ఇదివరకు భారత ప్రభుత్వ సంస్థగా నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా టాటా చేతిలోకి వెళ్లాక లాభాల బాట పట్టింది. టాటా గ్రూప్‌ అధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ ఇండియా (Air India) 2024-25 ఆర్థిక సంవత్సరం (FY25)లో రూ.61,000 కోట్ల ఆదాయం అందుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 14% వృద్ధిగా నమోదైంది. ఈ కంపెనీ 44 మిలియన్ల ప్రయాణికులను రవాణా చేయగా, ఇది గత సంవత్సరం కంటే 9.9% అధికమని సంస్థ అంతర్గత నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ వృద్ధికి ప్రధాన కారణాలు తక్కువ ఇంధన ధరలు, విస్తారా (Vistara)తో జరుగుతున్న విలీనం వల్ల ఏర్పడిన సమర్ధత, సంస్థ అమలు చేస్తున్న రూపాంతర ప్రణాళిక అయిన విహాన్.ఏఐ (Vihaan.AI) అని ఎయిర్ ఇండియా బోర్డుకు సమర్పించిన ఆర్థిక వివరాలలో పేర్కొన్నారు.

వాస్తవ లాభాల వివరాలు వెల్లడించనప్పటికీ, మూల కార్యకలాపాల లాభాలను సూచించే EBITDAR (Earn Before Interest, Taxes, Depreciation, Amortisation and Rent) విలువ సానుకూలంగా మారిందని Hindu BusinessLine కు  సంబంధిత వర్గాలు వెల్లడించాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఎయిర్ ఇండియా ఆదాయం వృద్ధి వివరాలు

FY24లో ఎయిర్ ఇండియా రూ.51,365 కోట్ల సమిష్టి ఆపరేటింగ్ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది FY23తో పోలిస్తే 24.5% వృద్ధిగా నమోదైంది. FY25లో కూడా ఈ జోరు కొనసాగించింది. రూ.61,000 కోట్ల వరకు ఆదాయం అందుకుంది. గతంలో రూ.38,812 కోట్ల టర్నోవర్ FY24లో నమోదు కాగా, అది FY23లో రూ.31,377 కోట్లుగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఎయిర్ ఇండియాలో వ్యవస్థాపక మార్పులు - విహాన్.ఏఐ

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత ప్రారంభించిన విహాన్.ఏఐ కార్యక్రమం ఐదు సంవత్సరాల లోపల సంస్థను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతోంది. 2025 మేలో సీఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ ప్రకారం, ఈ ప్రోగ్రామ్ ఇప్పటికే మధ్య దశను దాటిందని తెలిపారు. ప్రస్తుతం పాత విమానాల అప్‌గ్రేడ్‌పై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

విస్తారా విలీనం కూడా ఎయిర్ ఇండియాకు కలిసొచ్చింది

విస్తారా విలీన ప్రక్రియ వల్ల ఏర్పడిన సమర్ధత, పరిపాలన మార్పులు, వ్యయాల్లో క్షీణత వల్ల ఎయిర్ ఇండియాకు ఆర్థికంగా మేలు కలిగినట్లు వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా ప్రభుత్వం సంస్థగా ఉన్న సమయంలో తీవ్ర నష్టాల్లో మునిగిన ఎయిర్ ఇండియా ఇప్పుడు టాటా చేతిలోకి వెళ్లాక తిరిగి లాభాల్లోకి వచ్చినట్లు తాజా ఫలితాలు సూచిస్తున్నాయి. విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా స్థిరమైన పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తోందని ఈ రంగం నిపుణులు పేర్కొంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?