Elon Musk: ఎలాన్ మస్క్ రూ.850లకే అన్ లిమిటెడ్ డేటా ఇస్తారట: టెలికాం కంపెనీల పరిస్థితి ఏంటో?

Published : May 29, 2025, 07:09 PM IST
Elon Musk: ఎలాన్ మస్క్ రూ.850లకే అన్ లిమిటెడ్ డేటా ఇస్తారట: టెలికాం కంపెనీల పరిస్థితి ఏంటో?

సారాంశం

ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇండియాలో సాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభించనుంది. బేసిక్ ప్లాన్ నెలకు రూ.850 కంటే తక్కువ ఉంటుందని సమాచారం. లాంచ్ ఆఫర్‌లో అన్‌లిమిటెడ్ డేటా కూడా ఉండవచ్చు. స్టార్ లింక్ ఇంకా ఎలాంటి ఆఫర్లు ఇస్తోందో తెలుసుకుందాం రండి. 

ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు

ఎలాన్ మస్క్ సంస్థ అయిన స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్ త్వరలో భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబోతోంది. ఈ సేవలు సాటిలైట్ ఆధారంగా ఉంటాయి. ఇండియాలో ఇది ఒక వినూత్న సేవగా మారబోతోంది. ప్రపంచంలోనే చాలా తక్కువ ధరకు సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఇండియాలోనే ప్రారంభం కానున్నాయి. దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన సేవ ఇది స్టార్ లింక్ ప్రతినిధులు చెబుతున్నారు.

10 మిలియన్ల వినియోగదారులను సంపాదించడమే లక్ష్యం

స్టార్‌లింక్ ఇటీవల భారత ప్రభుత్వ టెలికాం శాఖ (DoT) నుంచి అనుమతి పత్రం (LoI) పొందింది. ఈ పత్రం ద్వారా దేశంలో కార్యాచరణ ప్రారంభించేందుకు తొలి అంగీకారాన్ని పొందింది. గతంలో నియంత్రణ, లైసెన్సింగ్ సమస్యల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు కీలక దశను దాటింది.

భారత్‌లో 10 మిలియన్ల మంది వినియోగదారులను సంపాదించడమే లక్ష్యంగా స్టార్‌లింక్ పనిచేస్తోంది. ప్రారంభంలో తక్కువ ధరకు ప్లాన్‌లు అందించి వినియోగదారుల్ని ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ముందస్తు పెట్టుబడులు, స్పెక్ట్రమ్ ఖర్చులు తిరిగి సంపాదించడానికి ఇది ఒక వ్యూహాత్మక ఆలోచన అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

స్టార్ లింక్ కు  ట్రాయ్ సూచనలు

అయితే టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్టార్ లింక్ కు కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా నగర వినియోగదారులపై అదనపు ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. సాటిలైట్ ఇంటర్నెట్ సేవల వ్యయం సాధారణ వైర్డ్ సేవల కంటే ఎక్కువగా ఉంటుందని ట్రాయ్ చెబుతోంది. అందుకే నగర వినియోగదారులకు నెలకు రూ.500 సర్‌ఛార్జ్ వసూలు చేయాలని సూచించింది.

ఇతర దేశాల్లో స్టార్ లింక్ సేవలు చాలా ఎక్కువ

ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్ సేవలు చాలా ఖరీదైనవి. అమెరికాలో, రెసిడెన్షియల్ లైట్ ప్లాన్‌కు నెలకు దాదాపు 80 డాలరు అంటే రూ.6,800 ఖర్చవుతుంది. అన్‌లిమిటెడ్ అయితే 349 డాలర్లు కట్టాలి. అంటే 29,700 రూపాయలన్న మాట. ఇది కూడా నాన్-ప్రియారిటీ డేటా మాత్రమే ఇస్తారు. తరచుగా ప్రయాణించే వారికి 50 డాలర్లు (రూ.4,200) నుంచి ప్రారంభమయ్యే రోమ్ ప్లాన్‌లు ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. 

స్టార్‌లింక్ ఇండియా సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయం ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు. అయితే కంపెనీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయవచ్చని అంచనాలు ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !