
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కంపెనీ ఈక్విటీలో వాటా కొనుగోలు చేసేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రెండు కంపెనీలు దీనిపై అధికారికంగా తమ వైఖరేమిటో వెల్లడించలేదు. అయితే సాఫ్ట్‌బ్యాంక్ అనుబంధ సంస్థ విజన్ ఫండ్ ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అన్నీ అనుకున్నట్టు జరిగితే రిలయన్స్ జియో ఈక్విటీలో 200 నుంచి 300 కోట్ల డాలర్ల వరకు సాఫ్ట్‌బ్యాంక్ (సుమారు రూ.14,000 కోట్ల నుంచి రూ.21,000 కోట్లు) పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ‘సాఫ్ట్‌బ్యాంక్, రిలయన్స్ జియో ఈక్విటీలో వాటా తీసుకోబోతోందనే వార్తలు గత రెండేళ్లుగా వింటున్నాం. కాబట్టి ఈ తాజా వార్తలు మాకైతే ఆశ్చర్యం కలిగించలేదు’ అని జేపీ మోర్గాన్ తన తాజా పరిశోధనా నివేదికలో పేర్కొంది.
4జీ టెలికం సేవల కోసం ప్రారంభించిన రిలయన్స్ జియో కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఇప్పటి వరకు దాదాపు రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇందులో అప్పుల వాటా రూ.1.07 లక్షల కోట్లు. దీంతో ఈ ఏడాది మార్చి నాటికి ఆర్‌ఐఎల్ అప్పుల భారం రూ.2.87 లక్షల కోట్లకు చేరింది.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పుల భారం రూ.69 వేల కోట్లు ఎక్కువ. ఆర్‌ఐఎల్, జియో కంపెనీల ఈక్విటీలో కొంతైనా అమ్మి, ఈ అప్పుల భారం తగ్గించుకోవాలన్నది ముకేశ్ వ్యూహంగా కనిపిస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో కెమికల్స్ విభాగం ఈక్విటీలోనూ 25 శాతం వాటాను, 1,000-1,500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.70 వేల కోట్ల నుంచి రూ.1.05 లక్షల కోట్లు) సౌదీ అరేబియా ఆరామ్‌కో కంపెనీకి అమ్మేందుకు ముకేశ్ అంబానీ సిద్ధమయ్యారు.
జియో మార్కెట్ విలువ రూ.3.5 లక్షల కోట్లు
4జీ సేవలతో దేశ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మార్కెట్ విలువ ప్రస్తుతం 5,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.5 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అంచనా. ఫ్రీ వాయిస్ కాల్స్‌తో అత్యంత చౌక డేటా ప్యాకేజీలతో జియో ఇప్పటికే 30 కోట్లకుపైగా ఖాతాదారుల్ని సంపాదించింది. దీంతో జియో ఈక్విటీలో వాటా తీసుకునేందుకు సాఫ్ట్‌బ్యాంక్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం టెలికం రంగానికే పరిమితమైన జియో త్వరలో బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్, కేబుల్ టీవీ సేవలు కూడా ప్రారంభించబోతోంది. దీంతో సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు పలు పీఈ కంపెనీలు జియోలో వాటా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ విషయంలో మిగతా కంపెనీల కంటే సాఫ్ట్‌బ్యాంక్ చాలా ముందు వరుసలో ఉంది.
టెలికం రంగంలో శక్తిమంతమైన సంస్థగా రూపుదిద్దుకున్న జియో ఆదాయం కూడా అదే స్థాయిలో సంపాదిస్తున్నది. ఈ క్రమంలో 70 వేల కిలోమీటర్ల ఫైబర్ నెట్ వర్క్, 17,500 టవర్ల బిజినెస్‌ను విడదీయాలని రిలయన్స్ జియో భావిస్తున్నది. టవర్లు. ఫైబర్ నెట్ వర్క్ నియంత్రణ బాధ్యతలను రెండు వేర్వేరు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ట్రస్టులకు బదిలీ చేయనున్నది.