రిలయన్స్ రూ.24 వేల కోట్లు ఆవిరి: మొత్తం రూ. 53 వేల కోట్లు హాంఫట్

By rajesh yFirst Published Jun 24, 2019, 12:15 PM IST
Highlights

చైనా- అమెరికా వాణిజ్య యుద్ధం, రుతుపవనాల ఆలస్యం తదితర అంశాల కారణంగా గతవారం స్టాక్ మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. ఫలితంగా టాప్ టెన్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.53 వేల కోట్లు ఆవిరైంది. అందులో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 24 వేల కోట్ల ఎమ్‌ క్యాప్‌ కోల్పోయింది. ఆరు దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. 

న్యూఢిల్లీ: భారత దిగ్గజ కంపెనీలు భారీగా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(ఎమ్‌ క్యాప్‌)ను కోల్పోయాయి. మార్కెట్‌లో వాటి విలువ వేగంగా పడిపోయింది. టాప్‌ టెన్‌ దేశీయ దిగ్గజ ప్రయివేటు కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం రూ. 53వేల కోట్లు ఆవిరయ్యాయి. 

ఇందులో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ అత్యధికంగా రూ. 24 వేల కోట్లను కోల్పోయింది. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలాంశాలు, అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌వార్‌, దేశంలో రుతుపవనాల రాక అంచనాలు తప్పడం లాంటి పలు కారణాలతో ఈ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయని విశ్లేషిస్తున్నారు. 
శుక్రవారంతో ముగిసిన గతవారం మార్కెట్‌లో ఆరు దిగ్గజ కంపెనీలు రూ. 53,458.8 కోట్ల విలువను కోల్పోయాయి. ఇందులో ముఖేష్‌ అంబానీ చైర్మెన్‌గా ఉన్న రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ అత్యధికంగా నష్టపోయింది. రూ. 23,929.9 కోట్లు కోల్పోవడంతో ఎమ్‌ క్యాప్‌లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ విలువ రూ. 8,10,889.8 కోట్లకు కుచించుకుపోయింది. 

అలాగే, రూ. 12,177 కోట్లు నష్టపోయిన హిందూస్థాన్‌ యునిలివర్‌ లిమిటెడ్‌ కంపెనీ విలువ రూ. 3,82,888.36 కోట్లకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ. 7,148.88 కోట్లు కోల్పోయి రూ. 3,68,796.02 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ. 4,785.48 కోట్లను నష్టపోయి విలువ రూ. 6,60,069.81 కోట్లకు కుచించుకుపోయింది. 

ఐటీసీ విలువ రూ. 4,535.7 కోట్లను కోల్పోయింది. ఐటీ దిగ్గజం టీసీఎస్‌ రూ. 881.81 కోట్లను నష్టపోయి ఆ కంపెనీ విలువ ఎమ్‌ క్యాప్‌లో రూ. 8,44,267.80కు కుదించుకుపోయింది. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంకులు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. 

ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విలువ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో పెరిగాయి. సాధారణంగా మదుపర్లు.. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో కంపెనీల విలువను పరిశీలించి వాటిలో పెట్టుబడులు పెడుతుంటారు. మార్కెట్‌లో ఒక కంపెనీ షేర్ల మొత్తాన్ని.. షేరు విలువతో గుణించి ఆ కంపెనీ విలువ లెక్క కడుతుంటారు. 
మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో విలువ అధికంగా ఉన్న కంపెనీలవైపే సాధారణంగా మదుపర్లు మొగ్గుచూపుతుంటారు. ఆ కంపెనీల్లో తమ పెట్టుబడులకు రక్షణ ఉంటుందని లాభం వస్తుందన్న అంచనాలు వేస్తుంటారు.

click me!