బడ్జెట్ పుణ్యమా అని...రిలయన్స్ సహా బ్లూచిప్‌లకు లక్షల కోట్ల నష్టం..

By Sandra Ashok Kumar  |  First Published Feb 3, 2020, 12:15 PM IST

బడ్జెట్ పుణ్యమా అని గత వారం స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ముగిశాయి. ప్రత్యేకించి రిలయన్స్ సహా పది బ్లూ చిప్ స్టాక్స్ ఏడు స్టాక్స్ నష్టాలను చవి చూశాయి. వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.89 లక్షల కోట్లు నష్టపోయాయి. ఈ వారం మార్కెట్లు ఆర్బీఐ చివరి సమీక్షపై ఆధారపడి సాగనున్నాయి.


న్యూఢిల్లీ: బడ్జెట్‌ దెబ్బకు గతవారం కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లలో ఈ వారం ఒడిదుడుకులు తప్పవని మార్కెట్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతవారం బ్లూచిప్‌ సంస్థలకు నిరాశే మిగిలింది. తొలి పది బ్లూచిప్‌ సంస్థల్లో మార్కెట్ లీడర్ రిలయన్స్ సంస్థతోపాటు ఏడు సంస్థలు ఏకంగా రూ.1.89 లక్షల కోట్ల మేర మార్కెట్‌ విలువను కోల్పోయాయి. 

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కోల్పోయిన మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా రూ.87,732.80 కోట్లు. గతవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,877.66 పాయింట్లు నష్టపోయి 40 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. రూ. 10 లక్షల కోట్ల స్థాయికి దూసుకుపోయిన రిలయన్స్ మార్కెట్‌ విలువ గతవారంలోనే రూ.87,732.80 కోట్లు పడిపోయి రూ.8,76,906.57 కోట్లకు పరిమితమైంది.

Latest Videos

undefined

also read ఫోటోలు లీక్:అమెజాన్ సి‌ఈ‌ఓ పై అతని గర్ల్ ఫ్రెండ్ సోదరుడి దావా...

వీటితోపాటు రూ. 31,148.40 కోట్లు కోల్పోయిన హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ.3,92,618.14 కోట్లకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.24,746 కోట్లు పతనం చెంది రూ.6,56,888.50 కోట్లకు పరిమితమైంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.19,044.70 కోట్లు క్షీణించి రూ.3,26,410.37 కోట్లకు, ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,652.40 కోట్లు పడిపోయి రూ.2,70,549.60 కోట్లుగా నమోదైంది.

టీసీఎస్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా రూ.7,317.15 కోట్లు పతనం చెంది రూ.8,12,428.81 కోట్లకు చేరుకున్నది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1,149.83 కోట్లు జారుకొని రూ.3,32,280.10 కోట్ల వద్ద ముగిసింది. కానీ, దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ విలువ మాత్రం రూ.2,392.15 కోట్లు పెరిగి రూ.2,71,332.15 కోట్లకు చేరుకున్నది.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రూ.1,182 కోట్లు బలపడి రూ.3,15,346.61 కోట్లకు చేరుకోగా, హిందుస్థాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌(హెచ్‌యూఎల్‌) రూ.119.07 కోట్లు మాత్రమే పెరిగి రూ.4,48,895.43 కోట్లకు చేరింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిజర్వుబ్యాంక్‌ తన చివరి పరపతి సమీక్షను ఈవారంలో ప్రకటించనుండటం, దేశ స్థూల ఆర్థికాంశాలు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

also read కరోనా వైరస్ దెబ్బకు చైనా స్టాక్ మార్కెట్లు విలవిల

2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మార్కెట్‌ వర్గాలను భయ కంపితులకు గురిచేసింది. దీంతో గత పదేళ్లలో ఇంతటి స్థాయిలో స్టాక్ మార్కెట్లు పతనమవడం ఇదే తొలిసారి. ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధికి ఊతమివ్వడానికి ఎలాంటి చర్యలు ప్రకటించకపోవడం నిరాశకు గురిచేసిందని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

ఈక్విటీ పొదుపు పథకాలపై ఆదాయం పన్ను మినహాయింపులు ఎత్తివేయడం మదుపరుల్లో ఆందోళనలను పెంచిందన్నారు. గురువారం ఆర్బీఐ పరపతి సమీక్షను ప్రకటించనుండగా, తయారీ రంగ సూచీ గణాంకాలు, భారతీ ఎయిర్‌టెల్‌, లుపిన్‌, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రాలు మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. గతవారంలో సెన్సెక్స్‌ 1,877.66 పాయింట్లు పతనం చెందింది. 

click me!