అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముగిసేందుకు తొలి దశ సంతకాలు చేయనున్నాయన్న వార్తలు.. ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన శిఖరాలకు దూసుకెళ్లాయి. లాభాల వరద సాగింది. సూచీలన్నీ ఆల్‌టైమ్ హైని తాకాయి. టెలికం, మెటల్ షేర్లు ఆకట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 530 పాయింట్లు ఎగిసి 40,889 పాయింట్లకు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 159 పాయింట్లు ఎగబాకి 12,074 పాయింట్లను తాకింది.
ముంబై/ న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాలు పోటెత్తాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణలు ద్రవ్యలోటును కట్టడి చేస్తాయన్న అంచనాలు.. మదుపరులను కొనుగోళ్ల దిశగా పరుగులు పెట్టించాయి.
ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు సరికొత్త స్థాయికి చేరుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్ 529.82 పాయింట్లు లేదా 1.31 శాతం ఎగబాకి 40,889.23 పాయింట్ల ఆల్‌టైమ్ హై వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 40,931.71 పాయింట్లనూ తాకింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 12 వేల మార్కును మరోసారి అధిగమించింది. 159.35 పాయింట్లు లేదా 1.34 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 12,073.75 వద్ద నిలిచింది.
also read ఢిల్లీ ఖాన్ మార్కెట్లో ఒక్క అడుగు స్థలనికి రెంట్ ఎంతో తెలుసా ?
రాబోయే ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరింతగా తగ్గిస్తుందన్న అంచనాలూ మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయని నిపుణులు తాజా మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు. ‘వచ్చే నెల రోజుల్లో వాణిజ్య యుద్ధంపై అమెరికా-చైనా దేశాలు ఓ అంగీకారానికి రావచ్చన్న వార్తలు.. ప్రపంచ మార్కెట్లలో కొనుగోళ్లకు మద్దతునిచ్చాయి.
ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళిక ద్రవ్యలోటును కట్టడి చేయగలదన్న ఆశలు భారతీయ మార్కెట్లకు లాభించాయి. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఆర్బీఐ ఇంకా తగ్గిస్తుందన్న అంచనాలూ మదుపరులను పెట్టుబడుల దిశగా నడిపించాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు 1.50 శాతం మేర పుంజుకున్నాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.జాతీయ, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడంతో మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేశారు. దీంతో ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలూ లాభాలను అందుకున్నాయి.
టెలికం షేర్లు దాదాపు ఏడు శాతం పుంజుకోగా, ప్రభుత్వ సాయం, టారీఫ్‌ల పెంపు ప్రకటనలు కలిసొచ్చాయి. మెటల్ షేర్లూ మూడు శాతానికిపైగా పెరుగగా, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలు ఇందుకు దోహదం చేశాయి.
ఇక ఊపందుకున్న వినియోగ సామర్థ్యం.. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఇతర కన్జ్యూమర్ చోదక రంగాలను ఆకర్షణీయంగా మార్చాయి. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్ షేర్ విలువ అత్యధికంగా లాభపడింది. 7.20 శాతానికిపైగా పుంజుకున్నది.
టాటా స్టీల్ 4.99 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 3.49 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.26 శాతం, వేదాంత లిమిటెడ్ షేర్ల విలువ 2.57 శాతం చొప్పున పెరిగాయి. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ 0.92 శాతం పెరిగి రూ.1,560.70 వద్ద ముగిసింది. ఓఎన్జీసీ, యెస్ బ్యాంక్ మినహా అన్ని షేర్లు లాభాల్లోనే ముగియడం విశేషం.
వరుస నష్టాలతో బక్కచిక్కిపోతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) షేర్లూ.. సోమవారం ట్రేడింగ్‌లో మదుపరులను ఆకట్టుకోవడం గమనార్హం. అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
also read ఐటీ ఉద్యోగులకు కొత్త భయాలు...ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?
ప్రస్తుతం టెలికం సేవలకు దూరంగా ఉన్న ఈ సంస్థ.. అప్పులను తీర్చేందుకు ఆస్తులను అమ్ముకుంటున్నది. ఈ క్రమంలోనే సంస్థ షేర్ విలువ చాలాకాలం తర్వాత 6 శాతానికిపైగా పుంజుకున్నది. బీఎస్‌ఈలో 4.55 శాతం పెరిగి 69 పైసల వద్ద ముగిసిన షేర్.. ఎన్‌ఎస్‌ఈలో 6.67 శాతం వృద్ధి చెంది 80 పైసల వద్ద నిలిచింది. ఆర్‌కామ్ ఆస్తుల కోసం సోమవారం రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ఐడియాతోపాటు మరికొన్ని సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.
స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెట్టడంతో మదుపరుల సంపద ఒక్కరోజే రూ.1.81 లక్షల కోట్లు ఎగబాకింది. సెన్సెక్స్ సుమారు 530 పాయింట్లు పెరుగడంతో అందులోని సంస్థల మార్కెట్ విలువ రూ.1,81,930.89 లక్షల కోట్లు ఎగిసి రూ.1,54,55,740.67 కోట్లకు చేరింది.
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 28 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్ల లాభాలు మదుపరుల సంపదను అమాంతం పెంచేశాయి. బీఎస్‌ఈలోని మొత్తం షేర్లలో 1,413 లాభపడితే, 1,086 నష్టపోగా, 208 స్థిరంగా ఉన్నాయి. మదుపరులు మళ్లీ స్టాక్స్ పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారని, దీంతో సూచీలు ఇక రికార్డులతో హోరెత్తించడం ఖాయమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.