
అదానీ గ్రూప్ ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ(FPO) ఉపసంహరణపై సెబీ ఈ వారం తన దర్యాప్తు నివేదికను విడుదల చేయనుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఫిబ్రవరి 15న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానుంది. అదానీ గ్రూప్ షేర్లలో ఇటీవలి పతనం సమయంలో రెగ్యులేటర్ తీసుకున్న పర్యవేక్షణ చర్యల గురించి సెబీ బోర్డు ఆర్థిక మంత్రికి తెలియజేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత, ఇన్వెస్టర్లకు ఎలా రక్షణ కల్పిస్తున్నారని సెబీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది కూడా ఈ భేటీలో చర్చనీయాంశం కావచ్చు.
జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ 110 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్ వంటి కార్యకలాపాలకు పాల్పడిందని ఆరోపించింది. కాగా అదానీ ఈ ఆరోపణలను ఖండించింది.
మూడీస్ దెబ్బకు ఆగని అదానీ షేర్ల పతనం…
మూడీస్ ఏజెన్సీ సంస్థ అదానీ గ్రూపులోని నాలుగు కంపెనీలకు నెగిటివ్ రేటింగ్ కారణంగా సోమవారం ఉదయం నుంచి ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల షేర్లు వరుసగా క్షీణించాయి, ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ దర 8 శాతానికి పైగా పడిపోయింది, క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ ఇచ్చిన నివేదికలో అదానీకి చెందిన నాలుగు కంపెనీలపై రేటింగ్ ఔట్‌లుక్‌ను 'నెగిటివ్'కి సవరించింది.
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ ప్రారంభ ట్రేడ్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్క్రిప్ 4.32 శాతం తగ్గి రూ. 1,767.60కి చేరగా, అదానీ పోర్ట్స్, ఎకనామిక్ జోన్ షేర్లు ఒక్కో షేరుకు 2.56 శాతం పడిపోయి రూ. 568.90కి చేరాయి.
ఉదయం సెషన్‌లో, అదానీ పవర్ షేర్లు రూ. 156.10కి, అదానీ ట్రాన్స్‌మిషన్ రూ. 1,126.85కి, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 687.75కి, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు రూ. 1,195.35కి పడిపోయాయి. ఈ స్క్రిప్‌లన్నీ ఒక్కొక్కటి 5 శాతం తగ్గాయి. అంబుజా సిమెంట్స్ స్క్రిప్ 3.34 శాతం క్షీణించి రూ. 349కి, అదానీ విల్మార్ 3.31 శాతం తగ్గి రూ. 421.65కి, NDTV 2.25 శాతం తగ్గి రూ. 203.95కి, ACC 1.49 శాతం తగ్గి రూ. 1,853కి పడిపోయింది.
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక అనంతరం అదానీ గ్రూపులోని షేర్లు ఒక్కసారిగా క్షీణించిన తర్వాత నాలుగు అదానీ గ్రూప్ కంపెనీలపై రేటింగ్ ఔట్‌లుక్‌ను స్టేబుల్ నుంచి నెగిటివ్ కు సవరించింది. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ శుక్రవారం ఈ మేరకు ఒకప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే అదానీ గ్రూపు మార్కెట్ క్యాప్ జనవరి 24తో పోల్చితే ఏకంగా 51 శాతం క్షీణించింది.