
పబ్లిక్ సెగ్మెంట్‌లో లీడ్ బ్యాంక్‌గా ఉంటోన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తన వడ్డీ రేటును పెంచింది. 20 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పెంచిన వడ్డీ రేట్లను 2 కోట్ల రూపాయలకు దిగువగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వర్తింపజేసింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో రేటును కొద్దిరోజుల వ్యవధిలో ఎస్బీఐ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచే పెంచిన వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి.
వడ్డీ రేట్లు ఇలా..!
వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 7 నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 2.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.40 శాతం. 46 నుంచి 179 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.40 శాతం. 180 నుంచి ఏడాదిలోపులో సాధారణ ప్రజలకు 4.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.10 శాతం పెంచింది.
పదేళ్లలోపు..
ఏడాది నుంచి రెండు సంవత్సరాల్లోపులో సాధారణ ప్రజలకు 5.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. రెండేళ్ల నుంచి మూడు సంవత్సరాలలోపు సాధారణ ప్రజలకు 5.35 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.85 శాతం. మూడేళ్ల నుంచి ఐదు సంవత్సరాల్లోపులో సాధారణ ప్రజలకు 5.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటును వర్తింపజేసింది. ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాలలోపులో సాధారణ ప్రజలకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.30 శాతం వడ్డీ ఉంటుంది.
ఈ నెల 8వ తేదీన భారతీయ రిజర్వు బ్యాంక్ తన రేపో రేటును పెంచిన విషయం తెలిసిందే. దీనితో పలు బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. 50 బేసిస్ పాయింట్లను పెంచడం వల్ల రేపో రేట్ 4.90 శాతానికి చేరింది. అంతకుముందు నెలలో కూడా రిజర్వు బ్యాంక్ 40 బేసిస్ పాయింట్లను సవరించింది. దీని ప్రభావంతో బ్యాంకులన్నీ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పెంచుకుంటూ వస్తోన్నాయి.
సీనియర్ సిటిజన్ల కోసం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా వుయ్ కేర్ పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వారికి అదనంగా ప్రీమియం అందుతుంది. ఈ ఎఫ్‌డీలకు 30 బేసిస్ పాయింట్లను పెంచింది. వుయ్ కేర్ (SBI We care) కింద ఐదు నుంచి 10 సంవత్సరాల్లోపు కాల పరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు దీన్ని వర్తింపజేసింది. 6.30 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది.