మార్కెట్లపై చమురు మంటలు.. సెన్సెక్స్ 213 డౌన్

By Arun Kumar PFirst Published Sep 16, 2019, 3:01 PM IST
Highlights

సౌదీలో ఆరామ్ కో సంస్థపై డ్రోన్ దాడుల ప్రభావం జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై గణనీయంగానే ఉంది. సెన్సెక్స్ 213 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ కూడా డౌన్ లోనే సాగుతోంది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్ పై 71.42 వద్దకు చేరింది. 

ముంబై : ముడిచమురు ధరలు భగ్గుమనడం, ఆర్థిక మందగమన భయాలు స్టాక్‌ మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం నష్టాల బాట పట్టాయి. ఆసియన్‌ పెయింట్స్‌, యస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ తదితర షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ తో రూపాయి విలువ 71.42కు పతనమైంది.

ఇక సెన్సెక్స్‌ 213 పాయింట్ల నష్టంతో 37,171 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 11,016 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

చమురు సరఫరాలో మునుపటి పరిస్థితులను నెలకొల్పేందుకు సౌదీ అరేబియా అడుగులు వేస్తున్నది. ఆదివారం ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. శనివారం సౌదీ చమురు ఉత్పాదక దిగ్గజం ఆరామ్‌కోకు చెందిన రెండు ప్లాంట్లపై డ్రోన్ దాడులు జరిగాయి. 

ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆధారిత హౌతీ రెబల్స్ పొరుగు దేశం యెమన్‌లో ప్రకటించింది. కాగా, ఈ దాడులతో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగం నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తి చేస్తున్న, ఎగుమతి చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 
 

click me!