డాలర్ బలహీనమైనా.. రూపీ @72

By pratap reddyFirst Published Sep 7, 2018, 8:34 AM IST
Highlights

అనుకున్నంతా అయింది. డాలర్ బలహీనపడినా.. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు మార్కెట్ నుంచి ఉపసంహరించడంతో రూపాయి విలువ ప్రతిష్టాత్మక 72స్థాయిని దాటి 72.09 స్థాయికి పతనమైంది. 

ముంబై: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత బక్కచిక్కింది. వరుసగా ఏడో రోజూ తగ్గింది. చరిత్రలోనే తొలిసారిగా  గురువారం 72 స్థాయి దిగువకు మారకం విలువ చేరింది. యథావిధిగా అంతర్జాతీయ స్థూల ఆర్థిక వ్యవస్థలపై ఆందోళనలు ఇందుకు కారణమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా డాలర్ కొంత బలహీనపడ్డా రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవడం గమనార్హం. గురువారం ట్రేడింగ్‌ ఆరంభంలో కాస్త కోలుకున్నట్టు కన్పించింది. ట్రేడింగ్‌ తొలి గంటల్లో 9 పైసలు పుంజుకున్న రూపాయి డాలర్‌తో పోలిస్తే రూ.71.66 వద్ద ట్రేడ్‌ అయ్యింది. 

అయితే ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ అంతకంతకు పెరిగింది. దీంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల్లో అనిశ్చితులు, చమురు ధరలు పెరగడం తదితర కారణాలతో తాజాగా రూపాయి విలువ మళ్లీ క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలో రూపాయి ప్రతిష్టాత్మకమైన రూ.72ల మార్క్‌ను దాటి రూ.72.09 స్థాయికి చేరింది.

ఇంటర్‌బ్యాంక్‌ ఫారెన్‌ ఎక్స్ఛేంజీ (ఫారెక్స్‌) మార్కెట్లో దేశీయ కరెన్సీ 71.67 వద్ద లాభాలతోనే మొదలైనా ఆ స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. 72 స్థాయి దిగువకు చేరింది. 72.11 స్థాయికి పతనమైన చివరికి 24 పైసలు బలపడి 71.99 స్థాయి వద్ద ముగిసింది. వరుసగా ఆరో రోజూ పడిన రూపాయి బుధవారం రికార్డు కనిష్ఠ స్థాయి 71.75కు చేరిన సంగతి తెలిసిందే.

గతేడాది ఇదే రోజుతో పోలిస్తే పోలిస్తే మన దేశ కరెన్సీ 12 శాతం కంటే ఎక్కువగా క్షీణించింది. ఇప్పటివరకు మిగతా దేశాల కరెన్సీ కంటే మెరుగ్గా ఉన్నదన్న కేంద్ర ఆర్థిక మంత్రి నుంచి ప్రతి ఒక్కరి వక్కాణింపులను తోసిరాజని ఆసియాలోని ఇతర వర్థమాన దేశాలతో పోలిస్తే మన కరెన్సీనే అధ్వాన పనితీరును ప్రదర్శించింది. విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లిపోతుండడం; కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతుండడంపై మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో పెట్టుబడులు తరలిపోవడం వల్ల వర్థమాన దేశాల కరెన్సీలు అమ్మకాల వత్తిడిని ఎదుర్కొంటాయి. మరోవైపు వ్యాపారవేత్తలు ముందు జాగ్రత్త చర్యగా డాలర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా డాలర్‌తో మారకంలో రూపాయి గత నెల రోజుల్లోనే 5 శాతం.. ఏడాదిలో 13 శాతం బలహీనపడింది. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వచ్చే నెలల్లో నగదు సరఫరాను తగ్గించనున్నట్లు ప్రకటించింది. 

అంతర్జాతీయ అంశాల వల్లే రూపాయి క్షీణిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారమే పేర్కొన్న సంగతి తెలిసిందే. అమెరికా కరెన్సీకి దిగుమతిదార్ల నుంచి బలమైన డిమాండ్‌ ఉండడంతో పాటు పెరుగుతున్న ద్రవ్యలోటు, ముడిచమురు ధరలకు తోడు వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడుల వల్ల దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెరుగుతోందని ఫారెక్స్‌ డీలర్లు చెబుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ప్రాథమికంగా వర్థమాన దేశ కరెన్సీల్లో బలహీనత కూడా డాలర్ బలోపేతానికి కారణమైంది.

ప్రభుత్వం నుంచి మార్కెట్లు కొంత మద్దతును కోరుతున్నాయి. ఓఎమ్‌సీలకు ప్రత్యేక గవాక్షం ఉండాలని.. అదే సమయంలో కొనుగోలుదార్లు క్రెడిట్‌, ఈసీబీ నిబంధనల్లో మరింత సడలింపునివ్వాలని అడుగుతున్నారు. ఆర్‌బీఐ వివిధ స్థాయిల్లో జోక్యం చేసుకున్నా.. అది రూపాయి చలనాలపై పెద్ద ప్రభావం చూపలేదని బ్రోకరేజీ సంస్థ ఒకటి పేర్కొంది.

click me!