ముకేశ్ అంబానీ ఖాతాలో మరో రికార్డు : సంపదలో బిజినెస్ టైకూన్‌ను అధిగమించేశాడు..

By Sandra Ashok KumarFirst Published Jul 11, 2020, 10:24 AM IST
Highlights

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. సంపదలో దాన కర్ణుడిగా పేరొందిన బిజినెస్ టైకూన్ వారెన్‌ బఫెట్‌ను దాటేశారు.
 

న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు,  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్‌ అంబానీ (63) తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. సంపన్నుల జాబితాలో నికర విలువ పరంగా, బిజినెస్‌​ టైకూన్‌, ప్రముఖ పెట్టుబడిదారుడు, అపర దాన కర్ణుడిగా పేరు గాంచిన బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్‌ను అధిగమించారు. 

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీ విలువ ఇప్పుడు 70.1 బిలియన్ డాలర్లుగా నిలిచింది. మరోవైపు,  వారెన్ బఫెట్ సంపద విలువ 67.9 బిలియన్ డాలర్లు మాత్రమే. దీంతో ముకేశ్ అంబానీ ప్రపంచంలో ఎనిమిదో ధనవంతుడిగా నిలిచారు.

రిలయన్స్‌ టెలికాం విభాగం జియోలో వరుస పెట్టుబడులతో ముకేశ్ అంబానీ సంపద గణనీయంగా పుంజుకుంది. దీంతో ప్రపంచంలోని టాప్-10 ధనవంతుల క్లబ్‌లో ఉన్న ఏకైక ఆసియా వ్యాపారవేత్తగా ముకేశ్ అంబానీ నిలిచారు.  

also read 

బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్‌ (82) 37 బిలియన్ డాలర్లకు పైగా బెర్క్‌షైర్ హాత్వే షేర్లను ఇటీవల విరాళంగా ఇచ్చిన తరువాత ఆయన సంపద క్షీణించింది. ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పేరొందిన బఫెట్‌ ఈ వారంలో 2.9 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. దీంతో ఆయన సంపద నికర విలువ క్షీణించింది.  

కాగా హురున్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, ముకేశ్ అంబానీ ఇటీవల ప్రపంచంలో ఎనిమిదవ ధనవంతుడిగా అవతరించారు. సంపన్న భారతీయుడిగా ముకేశ్ అంబానీ నంబర్ వన్ ర్యాంకులో దూసుకుపోతున్నారు.

ఈ ఏడాదిలో మొదటి 2 నెలల్లో తీవ్ర నష్టాలను నమోదు చేసినా జియోలో వరుస భారీ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్​ షేర్ రికార్డు గరిష్టాన్ని తాకింది. దీంతో కరోనా సంక్షోభంలో కూడా గణనీయమైన వృద్దిని సాధించి, అప్పుల్లేని సంస్థగా రిలయన్స్‌ అవతరించింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12.70 లక్షల కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరింది.

click me!