డిస్నీ స్టార్‌లో రిలయన్స్ వాటాలను కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతోంది. బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం త్వరలో ప్రకటించే వీలుందని మీడియాలో చర్చ ప్రారంభం అయ్యింది.
ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ కంపెనీ త్వరలో అంతర్జాతీయ మీడియా గ్రూప్ వాల్ట్ డిస్నీ ఇండియన్ ఆపరేషన్స్ ను కొనుగోలు చేయబోతోంది. బ్లూమ్‌బెర్గ్ అందించిన రిపోర్ట్ ప్రకారం, డిస్నీ- రిలయన్స్ భారతీయ కార్యకలాపాలను కొనుగోలు చేసే ప్రక్రియ వచ్చే ఏడాది నాటికి పూర్తవుతుంది. అమెరికన్ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన డిస్నీ హాట్ స్టార్‌లో తన వాటాను విక్రయించే వీలుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ఆధారంగా, ఈ ఒప్పందం ఆస్తి విలువ 7 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే నెలలో ఈ కొనుగోలుకు సంబంధించి కంపెనీ నుంచి ప్రకటనలు చేయవచ్చని నివేదిక పేర్కొంది. దీని కారణంగా, రిలయన్స్ యాజమాన్యంలోని కొన్ని మీడియా యూనిట్లను డిస్నీ హాట్ స్టార్‌లో విలీనం చేసే వీలుంది.
2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్ట్రీమింగ్ హక్కులను 2.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా అంబానీ ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమను ఓ కుదుపు కుదిపారు. JioCinema ప్లాట్‌ఫారమ్ ఈ సంవత్సరం ప్రారంభంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశీయ క్రికెట్ టోర్నమెంట్ (IPL)ని ఉచితంగా ప్రసారం చేయడం ద్వారా తన సత్తా చాటారు.
HBOతో రిలయన్స్ ఒప్పందం
వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, భారతదేశంలో HBO షోలను ప్రసారం చేయడానికి ఒప్పందాన్ని పొందడం ద్వారా రిలయన్స్ మరో విజయాన్ని సాధించింది. ఈ హక్కు ఇంతకు ముందు డిస్నీ వద్ద ఉంది. ఇదిలా ఉంటే డిస్నీ హాట్ స్టార్ కస్టమర్ బేస్ క్షీణిస్తున్నప్పటికీ, మీడియా గ్రూప్ మార్కెట్‌ను వదులుకోలేదు. మరింత పెట్టుబడి పెడుతోంది. కంపెనీ వ్యాపారం కోసం ఇతర ఎంపికలను అన్వేషిస్తోంది. భారత్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగిన పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ కోసం డిస్నీ ఇండియన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం రికార్డు స్థాయిలో 4.3 కోట్ల మంది వీక్షకులను ఆకర్షించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ను 3.5 కోట్ల మందికి పైగా వీక్షకులు వీక్షించారు.