చమురు షాక్?!: రిలయన్స్‌కు జియో, పెట్రో కెమికల్స్ జోడీ అండ

First Published 27, Jul 2018, 8:17 AM IST
Highlights

జియోతో చెలరేగిపోతున్న రిలయన్స్ సంస్థకు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు షాకివ్వనున్నాయి. అయితే జియో ప్లస్ పెట్రో కెమికల్స్ రంగాల్లో లభించే మద్దతు మాత్రమే రిలయన్స్‌ను కాపాడనున్నదని ఆర్థికవేత్తలు అంటున్నారు. 

ముంబై: జియో సంచలనంతో చెలరేగిపోతున్న ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌’కు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీ సంస్థ పురోభివ్రుద్ధిలో కీలకమైన ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగడమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ ఆర్థిక ఫలితాల్లో కంపెనీ నికర లాభ వృద్ధిపై ముడి చమురు ధరలు ప్రతికూల ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంటున్నారు. పెట్రో రసాయనాల వ్యాపారం వృద్ధి చెందుతుండడం, రిలయన్స్‌ జియో ఫలితాలు ఏకీకృత ఆదాయాలను పెంచే అవకాశాలే ఆ సంస్థకు ఊరట కానున్నాయి. శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ నెలతో ముగిసిన త్రైమాసికం ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నది.

గత నాలుగు త్రైమాసికాల్లో నికర లాభంలో 13-25 శాతం మేర వృద్ధి కనిపించిన రిలయన్స్.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 4 శాతం వృద్ధితో రూ.9457 కోట్లకు నికర లాభం చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత మూడు నెలల కాలంలో ముడి చమురు ధరలు దాదాపు 13 శాతం పెరగడంతో స్థూల రిఫైనింగ్‌ మార్జిన్ల (జీఆర్‌ఎమ్‌)లో ప్రతికూల పవనాలు వీస్తాయన్న భావన ఉంది. ఏప్రిల్‌-జూన్‌లో జీఎఆర్‌ఎమ్‌లు ఒక్కో బారెల్‌కు 10-10.5 డాలర్లుగా మాత్రమే నమోదు కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నాయి. ఇవి అంతక్రితం త్రైమాసికంలో 11 డాలర్లు; ఏడాది కిందట ఏప్రిల్‌-జూన్‌లో 11.9 డాలర్లుగా నమోదు కావడం విశేషం.

పెట్రో కెమికల్, జియో నుంచి రిలయన్స్‌కు మద్దతు ఇలా?


పెట్రోరసాయనాల వ్యాపారం కనీసం 35-40 శాతం వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో రిలయన్స్‌ జియో నుంచి కూడా ఆదాయాలకు మద్దతు ఉంది. ఈ రెండు కారణాల వల్ల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర విక్రయాలు 53 శాతం పైగా పెరిగి రూ.1.28 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. అంతక్రితం త్రైమాసికం(జనవరి-మార్చి)తో పోలిస్తే ఏకీకృత నికర లాభం కేవలం 0.2%, విక్రయాలు 9.4% మాత్రమే పెరగవచ్చని అయిదు బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి. స్టాండలోన్‌ పద్ధతిలో కంపెనీ నికర లాభం 4% పెరిగి రూ.8523 కోట్లకు; విక్రయాల్లో 45.1% వృద్ధితో రూ.93,158 కోట్లకు చేరే అవకాశం ఉంది. 

జియో పురోగతి ప్లస్ రిఫైనరీ ఆఫ్ గ్యాస్ క్రాకర్ ప్లాంట్‌తో ఇలా ఊతం


జియో లాభాల వృద్ధితోపాటు రిఫైనరీ ఆఫ్‌-గ్యాస్‌ క్రాకర్‌ ప్లాంటు ఏర్పాటవుతుండడం వల్ల పెట్రో రసాయనాల వ్యాపార మార్జిన్లు, విక్రయాలకు ఊతం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే పెట్‌కోక్‌ గ్యాసిఫికేషన్‌ యూనిట్ల ఏర్పాటు కూడా కలిసి వచ్చే అంశమేనంటున్నారు. ఏప్రిల్‌-జూన్‌లో 2.8 కోట్ల మంది వినియోగదార్లు జియోకు జత చేరడంతో జియో ఆదాయాలు రాణించొచ్చు. నిర్వహణ లాభంలో క్షీణత కూడా ఆరు శాతానికి పరిమితం కావొచ్చని యాక్సిస్‌ క్యాపిటల్‌ ఒక నివేదికలో పేర్కొంది. రిటైల్‌ వ్యాపారాల్లో సంస్థ ‘ట్రెండ్స్‌’, ‘రిటైల్‌’ స్టోర్లు రిలయన్స్ లాభాల బాటలో ఇందుకు సహకరించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అర్ధరాత్రి ఈక్విటీ డెరివేటివ్ ల ట్రేడింగ్ కోసం సెబీ దరఖాస్తు


ఈక్విటీ డెరివేటివ్‌ల ట్రేడింగ్‌ను అర్ధరాత్రి వరకు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ సెబీకి ఎన్‌ఎస్‌ఈ దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం డెరివేటివ్‌లలో ట్రేడింగ్‌ స్పాట్‌ మార్కెట్‌తో సమానంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 11.55 మధ్య రెండో సెషన్‌ నిర్వహించాలన్నది ఎన్‌ఎస్‌ఈ యోచన. మరి రెండో సెషన్‌లో కేవలం ఇండెక్స్‌ డెరివేటివ్‌ల ట్రేడింగ్‌ మాత్రమే ఉంటుందా? స్టాక్‌ డెరివేటివ్‌లు ఉంటాయా అన్న దానిపై స్పష్టత లేదు.

డెరివేటివ్ ట్రేడింగ్ పై మేలోనే సెబీ సమ్మతి

 
ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 11.55 వరకు డెరివేటివ్‌ ట్రేడింగ్‌ నిర్వహించేందుకు సెబీ ఈ ఏడాది మేలోనే సమ్మతి తెలియజేసింది. దేశీయంగా డెరివేటివ్స్‌ మార్కెట్లో 90% వాటా ఎన్‌ఎస్‌ఈ చేతిలోనే ఉండడంతో ఈ సంస్థ తొలుత ఈ దిశగా అడుగు వేయడం గమనార్హం. మరో ప్రధాన ఎక్స్చేంజ్ బీఎస్‌ఈ నిర్ణయం ఏంటన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ప్రస్తుతానికి కమోడిటీ ఎక్స్చేంజ్‌లు మాత్రమే అర్ధరాత్రి వరకు ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈక్విడీ డెరివేటివ్‌ ట్రేడింగ్‌ వేళలను అర్ధరాత్రి వరకు పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తామని... అదనపు వేళల వల్ల అయ్యే ఖర్చులను సర్దుబాటు చేసుకునే వ్యాపారం ఉండదని బ్రోకర్లు అంటున్నారు. 

Last Updated 27, Jul 2018, 8:17 AM IST