డిజిటల్‌ సేవల్లో రిలయన్స్‌ సంచలనం....

By Sandra Ashok Kumar  |  First Published Oct 26, 2019, 10:01 AM IST

రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ వ్యూహం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకంగా డిజిటల్ సేవల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేస్తూ అందులో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రిలయన్స్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోద ముద్ర వేసింది.  


న్యూఢిల్లీ: డిజిటల్‌ సేవల్లోనూ సంచలనం నెలకొల్పేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) సిద్ధమవుతోంది. ఇందుకు పూర్తి స్థాయి అనుబంధ కంపెనీ (డబ్ల్యూవోఎస్‌) ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్‌ జియోలో తనతోపాటు ఇతర మదుపరులకు ఉన్న రూ.1.08 లక్షల కోట్ల రుణపత్రాల పెట్టుబడులను ఈ అనుబంధ సంస్థకు బదిలీ చేస్తోంది. తన రుణాలను తగ్గించుకోవడంతోపాటు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పూర్తిస్థాయిలో డిజిటల్ సేవల కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తోంది రిలయన్స్.

రిలయన్స్‌ జియో కంపెనీలో ఆర్‌ఐఎల్‌ పెట్టుబడిగా పెట్టిన రూ.65,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులూ ఈ అనుబంధ కంపెనీకి బదిలీ అవుతాయని ఆర్‌ఐఎల్‌ శుక్రవారం రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. రైట్స్‌ ఇష్యూ కింద ఆప్షనల్లీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లు (ఓసీపీఎస్‌) జారీ చేసి.. ఈ రుణ పత్రాల పెట్టుబడిని కొత్తగా ఏర్పాటు చేస్తున్న పూర్తి అనుబంధ కంపెనీకి బదిలీ చేస్తారు. 

Latest Videos

ఇందుకు రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. దీంతో వచ్చే ఏడాది మార్చి నాటికి స్పెక్ట్రమ్‌కు సంబంధించిన కొద్ది రుణాలు మినహా రిలయన్స్‌ జియో అప్పుల నుంచి పూర్తిగా బయటపడుతుంది.
 
జియో నెట్‌వర్క్‌ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో కంపెనీ ఖాతాల్లో అప్పుల భారమూ పెరిగింది. కంపెనీ ప్రస్తుతం ఈ భారం తగ్గించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చిలో జియోకు చెందిన రూ.1.25 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతులను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ ట్రస్టు (ఇన్విట్స్‌)లకు బదిలీ చేసింది.

also read విదేశీ సంస్థల చేతికి ‘పెట్రోల్ పంపులు’....

దీంతో జియో ఆస్తుల విలువ రూ.2.37 లక్షల కోట్లకు తగ్గింది. జియో నెట్‌వర్క్‌ ద్వారా రిలయన్స్‌ అందించే డిజిటల్‌ సేవల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే అనేక సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశారు.ఈ సంస్థల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకే రిలయన్స్‌ ఇప్పుడు జియో ఆస్తులను పూర్తి అనుబంధ కంపెనీకి బదిలీ చేస్తోందని భావిస్తున్నారు.


 
జియో ద్వారా రిలయన్స్‌ ఇప్పటికే అనేక డిజిటల్‌ సేవలందిస్తోంది. ప్రత్యేక అనుబంధ కంపెనీ ద్వారా ప్రత్యర్ధి కంపెనీలకు దిమ్మతిరిగే రీతిలో డిజిటల్‌ సేవలు అందించాలని కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ యోచిస్తున్నట్టు మార్కెట్‌ వర్గాల అంచనా వేస్తున్నాయి. 

also read వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ టైటిల్ కోల్పోయిన అమెజాన్ సీఈఓ

రిలయన్స్ జియో ప్రవేశంతో దేశ టెలికం రంగంలో వచ్చిన మార్పులు అందరికీ తెలిసిందే. ఇప్పుడు పూర్తి డిజిటల్‌ సేవలతో మార్కెట్లో మళ్లీ అదే అలజడి సృష్టించాలని భావిస్తున్నట్టు సమాచారం. తన డిజిటల్‌ నెట్‌వర్క్‌ ద్వారా కిరాణా దుకాణాలు మొదలుకుని సమస్త సేవలను గుప్పిట్లో పట్టాలని అంబానీ భావిస్తున్నారు.
 
ఈ సందర్భంగా రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ కొత్త కంపెనీ దేశంలో డిజిటల్‌ సేవలను సమూలంగా మార్చేస్తుంది. ఆ సేవలు ఇప్పుడున్న కంపెనీలు అందిస్తున్న సేవలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ప్రతి భారతీయుడికి నిజమైన డిజిటల్‌ సమాజాన్ని ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ప్రపంచంలో అందుబాటులో ఉన్న అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాల్ని, డిజిటల్‌ యాప్‌లను దేశంలోనే అత్యధిక ఆదరణ ఉన్న జియో ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేస్తాం’ అని తెలిపారు. 

click me!