బ్యాంకు ఉద్యోగులు ఈ నెలాఖరులోనూ, మార్చి నెలలోనూ ఆందోళన బాట పట్టనున్నారు. వేతన సవరణపై భారతీయ బ్యాంకర్ల సంఘం (ఐబీఏ)తో బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీన, ఫిబ్రవరి ఒకటో తేదీన సమ్మె చేయనున్నట్లు వెల్లడించాయి. నెలాఖరులో సమ్మె చేపట్టనున్నందున ఏటీఎం లావాదేవీలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నది.
భారతీయ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు జనవరి 31, ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. వేతన సవరణపై భారతీయ బ్యాంకుల సంఘంతో చర్చలు విఫలమవడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ పశ్చిమబెంగాల్ కన్వీనర్ సిద్ధార్థ ఖాన్ మాట్లాడుతూ మార్చి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూడు రోజుల సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరిసారిగా ఈ నెల 13న భారతీయ బ్యాంకర్ల సంఘం ప్రతినిధులతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపారు.
undefined
అప్పటికీ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు యూఎఫ్‌బీయూ పశ్చిమబెంగాల్ కన్వీనర్ సిద్ధార్థ ఖాన్ తెలిపారు. కనీసం 15 శాతం వేతనాలు పెంచాలని తాము కోరుతుండగా.. ఐబీఏ మాత్రం 12.25 శాతం పెంచేందుకు అంగీకరించిదని తెలిపారు. ఇది ఏమాత్రం ఆమోదించదగినది కాదని స్పష్టం చేశారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రోజునే బ్యాంకు ఉద్యోగులు సమ్మె ప్రకటించడం గమనార్హం. నెలాఖరు నుంచి బ్యాంకు ఉద్యోగులు సమ్మె తలపెట్టడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అత్యవసర క్లియరెన్స్, ఏటీఎం సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఖాతాదారులు బ్యాంకర్లను కోరుతున్నారు.