ఆర్బీఐ, గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాకు ఇలా బీజం!

By Prashanth MFirst Published Dec 11, 2018, 9:25 AM IST
Highlights

ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినా, అందుకు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీనే బీజం పడింది. ఆ తరవాత ఆయన రాజీనామా చేస్తారనే వదంతులూ వచ్చాయి. అప్పట్లో పరిస్థితి సర్దు మణిగినా ఇప్పుడు తప్పలేదు. రాజీ పడేకంటే స్వతంత్రతకు కట్టుబడి వైదొలిగిన ఉర్జిత్ పటేల్.. అందుకు దారి తీసిన పరిణామాలు.. 

2018 ఆగస్టు 8: ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎస్‌ గురుమూర్తి, సహకార బ్యాంకింగ్‌ రంగ నిపుణుడు సతీష్‌ మరాఠీలను ఆర్బీఐ సెంట్రల్‌ బోర్డులో కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించింది. తర్వాతీ నెల మధ్యలో ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సభ్యుడు, ప్రముఖ బ్యాంకర్ నచికేత్‌ మోర్‌కు అర్ధాంతరంగా కేంద్రం ఉద్వాసన పలికింది.   

అక్టోబర్‌ 10: డజన్‌కు పైగా డిమాండ్లకు అంగీకరించేలా రిజర్వ్‌ బ్యాంక్‌ మెడలు వంచేందుకు గతంలో ఎన్నడూ ఉపయోగించని ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 నిబంధనను ప్రయోగిస్తూ ఆర్బీఐకి కేంద్రం మూడు లేఖలు రాసింది. వీటికి ఆర్బీఐ వారం తర్వాత సమాధానాలిచ్చింది.  

అక్టోబర్‌ 23:  ఆర్‌బీఐ దాదాపు ఎనిమిది గంటలపాటు మారథాన్‌ సమావేశం నిర్వహించింది. కానీ ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలపై అపరిష్కుతంగానే భేటీ ముగిసింది. 

అక్టోబర్‌ 26: ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉన్నదని బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ విరల్‌ ఆచార్య బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కాపాడకుంటే మార్కెట్ల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. 

అక్టోబర్‌ 29: మరో డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ కూడా గళమెత్తారు. బ్యాంకుల మూలధన నిష్పత్తులను తగ్గించే విషయంలో ఆర్బీఐ విముఖతను స్పష్టం చేశారు.  

అక్టోబర్‌ 31: ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి చాలా ముఖ్యమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మరింత మెరుగైన సుపరిపాలన  అవసరమని పేర్కొంది. 

నవంబర్‌ 3: మార్కెట్‌ సూచీలు, రూపాయి, క్రూడ్‌ ధరలు అన్నీ బాగానే పుంజుకుంటున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గర్గ్‌ వ్యాఖ్యానించారు. తద్వారా ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిపై విరల్‌ ఆచార్య వ్యాఖ్యలకు వ్యంగ్య సమాధానాలిచ్చారు. అదే నెల 9వ తారీఖున.. ఆర్‌బీఐ దగ్గర అసలు ఎన్ని నిధులు ఉండాలన్నది నిర్ణయించేందుకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

గురుమూర్తి ఇలా: ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నెలకొనడం మంచిది కాదని స్వతంత్ర డైరెక్టర్ గురుమూర్తి వ్యాఖ్యానించారు. కీలక రంగాలకు నిధులందకుండా చేయడం ద్వారా వృద్ధికి విఘాతం కలిగించకూడదంటూ నవంబర్‌ 17న ఆర్‌బీఐ బోర్డు సమావేశానికి రెండు రోజులు ముందు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించారు. 

నవంబర్‌ 19: పది గంటల పాటు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు భేటీ. రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్నది తేల్చేందుకు ప్యానెల్‌ ఏర్పాటుకు నిర్ణయం. చిన్న సంస్థలకు ఊరటనిచ్చే చర్యలు. 

డిసెంబర్‌ 5: ఆర్‌బీఐ, కేంద్రం మధ్య సంధి వార్తల నేపథ్యంలో విభేదాలపై స్పందించేందుకు పటేల్‌ నిరాకరణ. 

డిసెంబర్‌ 10: వ్యక్తిగత కారణాలతో గవర్నర్‌ పదవికి పటేల్‌ రాజీనామా.    

పదవీ కాలం మధ్యలో తప్పుకున్న ఐదో ఆర్బీఐ గవర్నర్

స్వతంత్ర భారత్‌లో పదవీ కాలం మధ్యలోనే రాజీనామా చేసిన ఆర్బీఐ గవర్నర్లలో అయిదో వ్యక్తి ఉర్జిత్ పటేల్‌. అంతక్రితం 1957లో బెనగల్‌ రామా రావు, 1977లో కేర్‌ పురి, 1990లో ఆర్‌ఎన్‌ మల్హోత్రా, 1992లో ఎస్‌ వెంకటరమణన్‌ పదవీ కాలంలో ఉండగానే వైదొలిగారు.ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి వైదొలగిన మూడో దిగ్గజ ఆర్థికవేత్త పటేల్‌. అంతక్రితం అరవింద్‌ పనగరియా కూడా పదవీకాలానికంటే ముందే నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిగా రాజీనామా చేశారు. అరవింద్‌ సుబ్రమణియన్‌ కూడా కొన్ని నెలల్లో పదవీకాలం ముగుస్తుందనగా ముఖ్య ఆర్థిక సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 

click me!