ఉర్జిత్ వారసత్వం విశ్వనాథన్‌కేనా?

By Prashanth MFirst Published Dec 11, 2018, 9:02 AM IST
Highlights

న్యూఢిల్లీ/ముంబై: ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ ఆకస్మిక రాజీనామా చేయటంతో కీలక పదవికి ఖాళీ ఏర్పడింది. బ్యాంకింగ్‌ రంగాన్ని నడిపించడంతోపాటు యావత్తు ఆర్థిక వ్యవస్థకూ దిశానిర్దేశం చేసే ఈ కీలక పదవి తదుపరి ఎవరిని వరిస్తుందనే విషయమై జోరుగా ఊహగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్, కేంద్రం ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌, ప్రస్తుత కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్, సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి పేర్లు వినిపిస్తున్నాయి.  

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లను గవర్నర్‌గా నియమించటమనే సంప్రదాయాన్ని చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. ఉర్జిత్‌ పటేల్‌ కూడా అలా వచ్చినవారే. రఘురామ్‌ రాజన్‌కు తదుపరి పొడిగింపు ఇస్తారని అంతా ఊహిస్తుండగా, కొన్ని అంశాల్లో విభేదాల వల్ల కేంద్రం ఆయనకు మరోసారి పొడగింపు ఇవ్వలేదు. 

అప్పటికప్పుడు కొత్త గవర్నర్‌గా వచ్చే వ్యక్తికి ఆర్బీఐపై పూర్తి అవగాహన ఉండాలి కనక అప్పట్లో ఉర్జిత్‌ను ఎంచుకుందనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు పరిస్థితి కాసింత భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే పటేల్‌ రాజీనామా ముందుగా తెలిసినది కాదు. కొత్తగా వచ్చే గవర్నరు ఆ వ్యవస్థతో బాగా సంబంధం ఉన్నవారైతేనే నయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సహజంగానే డిప్యూటీ గవర్నరు ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ పేరు వినిపిస్తోంది.

ఇప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దాలంటే సమర్థుడైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌కే బాధ్యతలు అప్పగించటం మంచిదన్నది ఆర్థిక వర్గాల భావన. ఇక సుభాష్‌ చంద్ర గార్గ్‌ను తీసుకున్నా ఆయన ప్రస్తుతం కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా ఉన్నారు. పైపెచ్చు ఈ హోదాలో ఆర్‌బఐ బోర్డులోనూ కొనసాగుతున్నారు. కాబట్టే ఈయన పేరు కూడా తెరపైకి వస్తోంది.  

స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌గా కొనసాగుతున్న అజయ్‌ త్యాగి ప్రస్తుతం మార్కెట్లలో పలు సంస్కరణలు తేవటంతో పాటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పలు అంశాల్లో దన్నుగా ఉంటూ వస్తున్నారు. ఇక కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌ గతంలో ఆ హోదాలో ఆర్బీఐ బోర్డులో కొన్నాళ్లున్నారు. ఆయనకూ ఆర్‌బీఐ గవర్నెన్స్‌ పట్ల అవగాహన ఉంది. పైపెచ్చు ఆయనకు మోదీ ప్రభుత్వంతో మంచి సంబంధాలే ఉన్నాయి. కనుక గార్గ్, దాస్‌ పేర్లు కూడా గవర్నర్‌ పదవి రేసులో వినిపిస్తున్నాయి. 

ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా నేపథ్యంలో తక్షణం ప్రభుత్వం తాత్కాలిక గవర్నర్‌ను నియమించాల్సి ఉంటుందని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. తరవాతే కొత్త గవర్నర్‌ నియామకం జరుపుతారని  ఆయన అభిప్రాయం. గవర్నర్‌ లేదా డిప్యూటీ గవర్నర్‌ రాజీనామా పరిస్థితుల్లో ప్రభుత్వం తనకు తానుగా కానీ లేదా ఆర్‌బీఐ బోర్డు సిఫారసుల ప్రాతిపదికనగానీ కొత్త నియామకం జరపాల్సి ఉంటుందని ఆర్‌బీఐ యాక్ట్, 1934 పేర్కొంటోంది. 

click me!