యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... రేపు సాయంత్రం 6గంటలకు...

By Sandra Ashok KumarFirst Published Mar 17, 2020, 10:03 AM IST
Highlights

యెస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టిన మదుపర్ల సొమ్ముకు డోకా లేదని ఆర్బీఐ మరోసారి హామీ ఇచ్చింది. ఈ నెల 18 సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో యెస్ బ్యాంకు పని చేస్తుందని వెల్లడించారు.

ముంబై: యెస్‌ బ్యాంకు సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం, ఆర్‌బీఐ సత్వర చర్యలు తీసుకుంటాయని భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ అన్నారు. ఈ నెల 26వ తేదీన యెస్‌ బ్యాంకు కొత్త బోర్డు బాధ్యతలు తీసుకుంటుందని సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో చెప్పారు. యెస్‌ బ్యాంకుపై మారటోరియాన్ని  బుధవారం సాయంత్రం 6గంటలకు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. 

డిపాజిటర్ల సొమ్ము పూర్తిగా భద్రంగా ఉందనీ, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నుంచి మామూలుగా విత్‌ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. 

also read స్టాక్‌ మార్కెట్లలో సేమ్ సీన్‌ రిపీట్..25 లక్షల కోట్లు ఆవిరి.. వాల్ స్ట్రీట్ నిలిపివేత

దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ చాలా భద్రంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మన బ్యాంకింగ్‌ వ్యవస్థలో ప్రైవేటు బ్యాంకుల పాత్రే అత్యంత కీలకమని చెప్పారు. యెస్‌ బ్యాంకుకు నగదు లభ్యత ఇబ్బందులు ఉంటే సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

ఇప్పటికే కరోనా వైరస్‌ ప్రభావం దేశంలోని పర్యాటకం, విమానయానం, హోటళ్లు, వాణిజ్యంపై పడిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. దేశ ఆర్థిక కార్యకలాపాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కొవిడ్‌ - 19 ప్రభావం దేశ, ప్రపంచ ఆర్థిక వృద్ధిపైనా ఉందని చెప్పారు. 

కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారిన వేళ భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుకొనేందుకు పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తలిపారు. 

ఇందుకోసం సమన్వయంతో వ్యూహాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులు వీలైనంత వరకు డిజిటల్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలు వినియోగించుకొనేలా ప్రోత్సహించాలని కోరారు. 

అయితే, ఏప్రిల్‌ 3న వరకు జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో దీనిపై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

పది రోజులుగా బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోయి అవస్థలు పడుతున్న యెస్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు ఊరట కలగనుంది. బుధవారం సాయంత్రం నుంచి తిరిగి పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నట్లు యెస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తమ అధికారిక ట్విటర్‌ ఖాతా వేదికగా వెల్లడించింది.

‘మార్చి 18, 2020 బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి బ్యాంక్‌ సేవలు పునరుద్ధరించనున్నాం. మార్చి 19, 2020 గురువారం  వినియోగదారులు 1,132 బ్రాంచులను సైతం సందర్శించవచ్చు. డిజిటల్‌ బ్యాంకింగ్‌తో పాటు అన్ని రకాల సేవలను పొందవచ్చు’అని ట్వీట్‌లో తెలిపింది. 

also read కరోనా దెబ్బకు ఫార్మాసి రంగం కుదేలు...నిలిచిపోయిన దిగుమతులు...

ఆర్‌బీఐ విధించిన మారటోరియం గడువు మార్చి 18వ తేదీతో పూర్తి కానుండడంతో సేవలు పునరుద్ధరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్షోభంలో చిక్కుకున్న యెస్‌ బ్యాంక్‌పై మార్చి 5వ తేదీన ఆర్‌బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే. 

బ్యాంక్‌ను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు పునరుద్ధరణ ప్రణాళికలు సైతం రూపొందించింది. ఆ పునరుద్ధరణ ప్రణాళికను శుక్రవారం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

ఈ బ్యాంక్‌లో ఎస్‌బీఐ సహా పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకులు రాణాకపూర్‌ను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. 

click me!