సంస్థ అధికారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు...: మిస్త్రీ పై రతన్ ఫైర్

By Sandra Ashok KumarFirst Published Jan 4, 2020, 12:05 PM IST
Highlights

సైరస్ మిస్త్రీని టాటా సన్స్ సంస్థ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని ఎన్సీఎల్ఏటీ జారీచేసిన ఆదేశాలు పెను తుఫానే స్రుష్టించాయి. దీనిపై సంస్థ గౌరవ చైర్మన్ హోదాలో రతన్ టాటా, టాటా గ్రూప్ సంస్థలు, ట్రస్ట్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రొఫెషనల్‌గా మాత్రమే మిస్త్రీని చైర్మన్ గా నియమించామే తప్ప.. ఆయన కుటుంబ వాటాలను చూసి కాదన్నారు రతన్ టాటా. అసలు చైర్మన్ అయిన తర్వాత టాటా సన్స్ సంస్థ అధికారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. మైనారిటీ వాటా హక్కుల గురించి ఉద్వాసనకు గురి కాక ముందు మిస్త్రీ ఎందుకు లేవనెత్తలేదని ట్రస్ట్‌లు ప్రశ్నించాయి. 

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలతో  మిస్త్రీ, టాటాల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. దీనిపై సుప్రీంకోర్టును టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా ఆశ్రయించారు. టాటా సన్స్‌ చైర్మన్‌ అయిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా సొంత కుటుంబ వ్యాపారాన్ని దూరం పెట్టడంలో మిస్త్రీ విఫలమయ్యారని ఆరోపించారు.

అంతే గాక ‘అధికారాలన్నీ మిస్త్రీ తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. టాటా సన్స్‌ నిర్వహణలోని సంస్థల వ్యవహారాల విషయంలో బోర్డు సభ్యులను దూరంగా ఉంచారు. బలవంతంగా రుద్దే నిర్ణయాలను ఆమోదించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది‘ అని రతన్‌ టాటా విమర్శించారు. 

also read భగ్గుమన్న బంగారం ధరలు...పది గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా...?

గ్రూప్‌ అభ్యున్నతి కోసం కృషి చేసిన తనపై ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పులో నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని రతన్ టాటా పేర్కొన్నారు. ఈ తీర్పు ఒక తప్పుడు ఒరవడి సృష్టిస్తుందని, భవిష్యత్‌లో పలు కంపెనీలకు వ్యతిరేకంగా దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  

రతన్ టాటాతోపాటు టాటా ట్రస్ట్‌లు, గ్రూప్‌ సంస్థలు.. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌కు చెందిన ట్రస్టీలు కూడా వేర్వేరు పిటిషన్లు వేశాయి. ‘ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు అసంబద్ధం, తప్పు, కేసు రికార్డుకు పూర్తిగా విరుద్ధం‘ అని రతన్‌ టాటా పిటిషన్‌లో పేర్కొన్నారు. మిస్త్రీని వృత్తిపరంగానే చైర్మన్‌గా నియమించడం జరిగిందే తప్ప.. ఆయన కుటుంబానికి (షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌) టాటా గ్రూప్‌లో అత్యధిక వాటాలు ఉన్నందుకు కాదని స్పష్టం చేశారు. 

also read కార్పొరేట్ ప్రజాస్వామ్యానికి ముప్పు...సైరస్ మిస్త్రీ నియామకంపై టాటా సన్స్

టాటా గ్రూప్‌లో మైనారిటీ షేర్‌హోల్డర్ల నోరు నొక్కేస్తున్నారంటూ మిస్త్రీ చేసిన ఆరోపణలపైనా టాటా ట్రస్టులు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. 2006 నుంచి సైరస్‌ మిస్త్రీ టాటా సన్స్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు గానీ, ఆ తర్వాత చైర్మన్‌ అయినప్పుడు గానీ అణచివేత గురించి ఎన్నడూ మాట్లాడలేదని.. ఉద్వాసనకు గురయ్యాకే హఠాత్తుగా వీటిని తెరపైకి తెచ్చారని విమర్శించాయి. 

గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటా.. 1917లో టాటా సన్స్‌ను ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగానే ఏర్పాటు చేశారని ట్రస్టులు పేర్కొన్నాయి. మిస్త్రీ కుటుంబం ఇప్పటి దాకా రూ. 69 కోట్లు పెట్టుబడి పెట్టిందని, 2016 మార్చికి వారి వాటాల విలువ రూ. 58,441 కోట్లకు ఎగిసిందని, 1991–2016 మధ్య రూ. 872 కోట్ల డివిడెండ్లు అందుకున్నట్లు ట్రస్టులు పేర్కొన్నాయి.

click me!