పీటముడి: ఉర్జిత్‌కు బజాజ్ బాసట.. సర్కార్ మాటే వేదమన్న గురుమూర్తి

By sivanagaprasad kodatiFirst Published Nov 16, 2018, 8:46 AM IST
Highlights

కేంద్రానికి ఆర్బీఐ వద్ద గల నిల్వలు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై జాతీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ప్రభుత్వం, ఆర్బీఐ తమ వైఖరికే కట్టుబడి ఉంటే సమస్యాత్మకం అవుతుందని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఉర్జిత్ పటేల్ వైఖరే సరైందని ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ పేర్కొన్నారు. 

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)కి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య నిధుల బదలాయింపు, బ్యాంకు స్వయంప్రతిపత్తి, కేంద్రం దూకుడుపై పీటముడి ఇప్పట్లో వీడే సంకేతాలు కనిపించడం లేదు. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌ బాసటగా నిలిచారు.

ఒకవేళ ప్రభుత్వం ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌-7ను ప్రయోగించాల్సి వస్తే ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌కు రాజీనామా చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ఈనెల 19న ఆర్బీఐ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో రాహుల్ బజాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇటీవల ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య చెలరేగిన వివాదాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ సూచించారు. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరించకూడదని అభిప్రాయపడ్డారు.

ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వ జోక్యం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ వినియోగించని ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌-7ను ప్రయోగించాలనుకోవడం దారుణమని ఆక్షేపించారు. బజాజ్‌ గ్రూపు ప్రతియేటా అందించే జమ్నాలాల్‌ బజాజ్‌ అవార్డుల కార్యక్రమం సందర్భంగా రాహుల్‌ బజాజ్‌ పైవిధంగా స్పందించారు.

మరోవైపు ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ప్రభుత్వానికి ఆర్బీఐ వద్ద ఉన్న నిధులు ఇచ్చేయాల్సిందేనని వాదించారు. ప్రపంచంలో ఏ బ్యాంకు వద్ద ఇంత భారీగా నిధుల్లేవన్నారు. పీసీఏ, ఎంఎస్ఎంఈ రుణ నిబంధనలను సడలించాలని సూచించారు.

‘ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద గణనీయ స్థాయిలో రూ.9.6 లక్షల కోట్ల నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ సెంట్రల్‌ బ్యాంకు వద్ద కూడా ఈ స్థాయిలో నిల్వలు లేవు. అయినా ఆర్‌బీఐ వద్ద ఎంత మిగులు నిల్వలు ఉండాలనే విషయంపై ఓ విధానాన్ని రూపొందించాలని మాత్రమే ప్రభుత్వం అడుగుతోంద’ని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్న గురుమూర్తిని కొన్ని నెలల క్రితమే ఆర్‌బీఐ బోర్డులోకి తీసుకున్నారు. వివేకానంద ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్‌, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల స్థితిగతులపై గురుమూర్తి ప్రసంగిస్తూ, ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొనడం ఏమాత్రం మంచి పరిణామం కాదన్నారు. 

ఎన్‌బీఐఎఫ్‌ల రుణ నిబంధనలు సడలించడం, సత్వర దిద్దుబాటు చర్యల నిబంధనల సరళీకరణ సహా పలు అంశాలపై గత కొన్ని రోజులుగా ఆర్‌బీఐ, ఆర్థిక శాఖల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

వీటి గురించి ప్రస్తావిస్తూ చిన్న, మధ్య తరహా సంస్థల రుణ నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ జీడీపీలో ఈ సంస్థల వాటా 50 శాతం వరకు ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

మొండి బకాయిల కేటాయింపులకు సంబంధించి కఠిన నిబంధనలు ఉంటే బ్యాంకింగ్‌ వ్యవస్థలో సమస్యలకు దారితీస్తుందని గురుమూర్తి అన్నారు. ప్రపంచ బాసెల్‌ నిబంధనల కంటే కూడా భారత్‌లో కనీస మూలధన నిష్పత్తి ఒక శాతం అధికంగా ఉందని చెప్పారు.

‘ఎగవేత ముప్పు లాంటి పరిణామాలు సంభవిస్తే రక్షణాత్మకంగా వ్యవహరించేందుకు 12%, 18.76% వరకు నిల్వలను ఉంచుకోవాలని రెండు రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్‌బీఐ వద్ద ప్రస్తుతం 27-28% వరకు నిల్వలు ఉన్నాయి.

ఇటీవల రూపాయి క్షీణతతో ఈ నిల్వల స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంద’ని గురుమూర్తి చెప్పారు. ‘నిల్వలు చాలా పెరిగాయి కదా అని ఆ డబ్బులు ఇవ్వమని అడగకూడదు. ప్రభుత్వం కూడా అలా అడుగుతోందని నేను అనుకోవడం లేదు. కేవలం ఆర్‌బీఐ వద్ద ఎంత నిల్వలు ఉండాలో ఓ విధానాన్ని రూపొందించమనే అడుగుతోంద’ని ఆయన చెప్పారు.
 

click me!
Last Updated Nov 16, 2018, 8:46 AM IST
click me!