
నెలవారీ సంపాదనలో ఎంతో కొంత కూడబెడితేనే భవిష్యత్ అవసరాలు తీర్చుకోగలమనే కొంత భరోసా లభిస్తుంది. అందుకే చాలామంది సేవింగ్స్‌పై దృష్టి సారిస్తుంటారు. అందులోనూ ఎక్కువ వడ్డీ వచ్చే సేవింగ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వాటిల్లో పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ ముందు వరుసలో ఉంటాయని చెప్పొచ్చు. పోస్టాఫీస్ అందించే బెస్ట్ స్కీమ్స్‌లో పీపీఎఫ్ ఒకటి. ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏమిటి..?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అనేది ఒక దీర్ఘకాల సేవింగ్స్ ఆప్షన్. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులోనూ SIP (Systematic Investment Plan) తరహా ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. సంవత్సరానికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. పీపీఎఫ్‌పై వచ్చే వడ్డీ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), రికరింగ్ డిపాజిట్లు (RD) కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా పొందే వడ్డీ లేదా మెచ్యూరిటీపై ఎలాంటి పన్ను ఉండదు.
పీపీఎఫ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్: పీపీఎఫ్ అకౌంట్ ద్వారా మీరు ప్రతీ నెలా రూ.5 వేలు ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఏడాదికి రూ. 60 వేలు మీ ఖాతాలో జమవుతాయి. దీనిపై 7.1 శాతం చక్రవడ్డీ (Compound Interest) పొందుతారు. ఒకవేళ మీరు నెలకు రూ. 5 వేలు చొప్పున 15 ఏళ్ల పాటు పొదుపు చేస్తే.. మెచ్యూరిటీ సమయానికి వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ.16.25 లక్షలకు చేరుతుంది. ఇందులో రూ.7.25 లక్షలు వడ్డీ రూపంలో పొందుతారు.
పీపీఎఫ్ స్కీమ్ బెనిఫిట్స్: పీపీఎఫ్ స్కీమ్ కింద ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5లక్షలు పొదుపు చేయవచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ పొదుపు చేసినా రూ.1.5లక్షలకే వడ్డీ చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మీరు నెలవారీగా కూడా చెల్లించవచ్చు. పదేళ్లలోపు మీ పిల్లలకు కూడా పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు. ఆ ఖాతా వ్యవహారాలను మీరే చూసుకోవచ్చు. 15 ఏళ్ల కాలానికి మీరు పొదుపు చేస్తే.. ఆ తర్వాత మరో ఐదేళ్ల పాటు పొడగించుకోవచ్చు. అంతేకాదు, ఈ ఖాతాపై (Savings Scheme) మీరు బ్యాంకు రుణం కూడా పొందవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు.