
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అదనపు కంట్రిబ్యూషన్స్‌పై అర్జించిన వడ్డీ మొత్తంపై పన్ను విధింపు అంశానికి సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం చూస్తే.. పీఎఫ్ ఖాతాదారులకు రెండు పీఎఫ్ అకౌంట్లు ఉండబోతున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం.. ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలు దాటితే అలాంటి వారు కచ్చితంగా రెండు ప్రావిడెంట్ ఫండ్ PF ఖాతాలు కలిగి ఉండాల్సి ఉంటుంది. అంటే వారి పీఎఫ్ ఖాతాను రెండు భాగాలుగా విభజిస్తారు. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ఈ రూల్ అమలులోకి వస్తుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) నుంచి పీఎఫ్ ఖాతా రెండు భాగాలుగా విభజించే వీలుంది. గత ఏడాది సెప్టెంబర్లో కేంద్రం నోటిఫై చేసిన కొత్త ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. ఇప్పటికే ఉన్న పీఎఫ్ ఖాతాలను రెండు భాగాలుగా విభజన కానున్నాయి. పీఎఫ్ ఖాతాను రెండు భాగాలుగా విభజించడం ద్వారా.. వార్షికంగా ఉద్యోగి వాటా రూ.2.5 లక్షలకన్నా ఎక్కువుగా ఉంటే.. అదనంగా జమ అయిన మొత్తంపై పన్ను వసూలు చేసేందుకు వీలు కల్పించనుంది. దీనితో పాటు సంపాదన అధికంగా ఉన్న ఉద్యోగులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల నుంచి మినహాయించేందుకూ ఈ కొత్త విధానం ఉపయోగపడనుంది.
ఏప్రిల్ 1 తర్వాత పీఎఫ్ ఖాతాలన్ని రెండు భాగాలుగా విడిపోనున్నాయి. ఒకటి ట్యాక్సబుల్ అకౌంట్. రెండోది నాన్ ట్యాక్సబుల్ అకౌంట్. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు పీఎఫ్ చందాదారులందరికీ వర్తించనున్నాయి. అయితే 2021 మార్చి 31తో నాటికి క్లోజ్ అయిన అకౌంట్లకు కూడా ఈ నింబంధనలను వర్తింపజేయనుంది ప్రభుత్వం. పీఎఫ్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల వాటా.. రూ.2.5 లక్షలు దాటితే.. దానిపై పన్ను విధించనుంది ఐటీ విభాగం. ఇందుకోసం సెక్షన్ 9డీని ఐటీ చట్టాల్లోకి తెచ్చింది కేంద్రం.
ట్యాక్సబుల్ అకౌంట్ పరిధిలికి వచ్చే వారికి మాత్రమే అదనపు పన్ను భారం పడనుంది. నాన్ ట్యాక్సబుల్ ఖాతా ఉన్న వారికి ఎప్పటిలానే అన్ని బెనిఫిట్స్ అందుతాయి. పీఎఫ్ ఖాతాల అధికంగా జమ చేస్తూ చాలా మంది సంపన్నులు పన్ను మినహాయింపులు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ కారణంగానే గత ఏడాది పీఎఫ్ ఖాతాలను విభజించాలని నిర్ణయించింది.