బిగ్ రిలీఫ్.. లీటర్ పెట్రోల్‌పై రూ. 25 తగ్గించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పూర్తి వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Dec 29, 2021, 5:21 PM IST
Highlights

గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు (petrol and diesel prices) వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ రాష్ట్రంలో మాత్రం లీటర్ పెట్రోల్‌పై రూ. 25 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 26 నుంచి ఈ రేట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు (petrol and diesel prices) వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పెట్రోల్ ధరలపై జార్ఖండ్ (Jharkhand ) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ ధరను 25 రూపాయలు తగ్గిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ బుధవారం ప్రకటించారు. అయితే అది ద్విచక్ర వాహనాలకు మాత్రమేనని Hemant Soren వెల్లడించారు. మోటార్ సైకిళ్లు, స్కూటర్ల‌కు లీటర్ పెట్రోల్‌పై రూ. 25 రాయితీ ఇవ్వాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హేమంత్ సోరెన్ తెలిపారు. ఈ మార్పులు జనవరి 26 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. 

రాష్ట్రంలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా ప్రభుత్వం ఏర్పటి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ హేమంత్ సోరెన్ ఈ ప్రకటన చేశారు. ‘పెట్రోలు, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతుండడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే  ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ద్విచక్ర వాహనాలకు పెట్రోల్‌పై లీటరుకు రూ. 25 ఉపశమనం ఇస్తున్నాం. ఈ ప్రయోజనం  2022 జనవరి 26 నుంచి ప్రారంభమవుతుంది’ అని హేమంత్ సోరెన్ వెల్లడించారు. 

ఇక, 2019లో జేఎంఎం.. కాంగ్రెస్‌, ఆర్జేడీ‌లతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో.. జేఎంఎం కూటమి 47 స్థానాల్లో విజయం సాధించింది.  జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. ఆ తర్వాత వికాస్ మోర్చాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. 

 

पेट्रोल-डीजल के मूल्य में लगातार इजाफा हो रहा है, इससे गरीब और मध्यम वर्ग के लोग सबसे अधिक प्रभावित हैं। इसलिए सरकार ने राज्य स्तर से दुपहिया वाहन के लिए पेट्रोल पर प्रति लीटर ₹25 की राहत देगी, इसका लाभ 26 जनवरी 2022 से मिलना शुरू होगा:- श्री pic.twitter.com/MsinoGS60Y

— Office of Chief Minister, Jharkhand (@JharkhandCMO)

ఇక, ఈ ఏడాది నవంబర్‌లో దీపావళి కానుకగా కేంద్ర  ప్రభుత్వం.. లీటరు పెట్రోల్‌‌పై రూ. 5, లీటర్​ డీజిల్‌‌పై  రూ. 10 చొప్పున ఎక్సైజ్​ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు, మరికొన్ని రాష్ట్రాలు అదే బాటలో నడిచాయి. 

click me!