ముంబైలో రూ.90 దాటిన పెట్రోల్ రేట్: ఢిల్లీలో చౌక

By Arun Kumar PFirst Published Sep 24, 2018, 12:49 PM IST
Highlights

పెట్రోల్ ధరల్లో మరో రికార్డు నమోదైంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90 దాటితే.. మెట్రోపాలిటన్ నగరాల పరిధిలో దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం చౌకగా లభిస్తోందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. 

న్యూఢిల్లీ: విపక్షాలు వ్యతిరేకిస్తున్నా.. ప్రజలు మండి పడుతున్నా.. కేంద్రం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి డీజిల్ ధర పెరక్కున్నా పెట్రోల్ లీటర్ ధర మాత్రం రికార్డులు బ్రేక్ చేస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.90 దాటింది. రూపాయి మారకం విలువ పతనం కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడంతో సోమవారం నాలుగు మెట్రో పాలిటన్ నగరాల పరిధిలో పెట్రోల్ ధర లీటర్‌పై ఐదు పైసల నుంచి 12 పైసలు పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.08 పలుకుతోందని ఐఓసీ వెబ్ సైట్ పేర్కొన్నది.  

ఇక దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.72కాగా, కోల్ కతాలో 84.54, చెన్నైలో రూ.85.99 పలుకుతోంది. ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.78.87 కాగా, ఢిల్లీలో రూ.74.26, కోల్ కతాలో రూ.75.87, చెన్నైలో 78.26 పలుకుతున్నది. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. 

ఆదివారం లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.82.61 కాగా, కోల్ కతాలో రూ.84.44, ముంబైలో 89.97, చెన్నైలో రూ.85.87లకు పెరిగింది. న్యూఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.73.97, కోల్ కతాలో రూ.75.82, ముంబైలో రూ. 78.53, చెన్నైలో రూ.78.20లకు లభించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో పెట్రోల్ ధర 11 పైసలు, కోల్ కతాలో 10 పైసలు, చెన్నైలో 12 పెసలు పెరుగుతున్నది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాల్లో డీజిల్ లీటర్ ధర ఐదు పైసలు, చెన్నైలో ఆరు పైసలు పెరిగింది.

గమ్మత్తేమిటంటే ముంబైలో పెట్రోల్ లీటర్ ధర సోమవారం రూ.90 దాటినా.. మహారాష్ట్రలోని 12 నగరాల పరిధిలో ఆరు రోజుల క్రితం రూ.91 మార్క్‌ను దాటేసింది. మహారాష్ట్రలోనే ఇంధన ధరలు అధికం. అత్యధిక వ్యాట్ విధిస్తున్నదీ మహారాష్ట్రలోనే. పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ అత్యధికంగా 39 శాతంతోపాటు పెట్రోల్‌పై సర్ చార్జి తొమ్మిది రూపాయలు, డీజిల్‌పై రూపాయి సర్ చార్జీ భారం పడుతోంది. ముంబై, థానే, నేవీ ముంబై నగరాల పరిధిలో పెట్రోల్ కొనుగోళ్లపై 25 శాతం వ్యాట్.. మిగతా మహారాష్ట్రలో 26 శాతం పడుతోంది. 

డీజిల్ కొనుగోళ్లపై ముంబై, థానె, నేవీ ముంబైల్లో 21 శాతం, మిగతా రాష్ట్రంలో 22 శాతం వ్యాట్ అమలవుతోంది. రూపాయి సర్ చార్జీ దీనికి అదనం. గత నెల 31వ తేదీ నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.2.50, డీజిల్ లీటర్ ధర రూ.3.92 పెరిగింది. ఆరు రోజుల క్రితం మహారాష్ట్రలోని పర్బానీలో రూ.91.27 పలుకుతున్నది. నాందూర్బార్, నాందేడ్, లాతూర్, జలగావ్, బీడ్, ఔరంగాబాద్, రత్నగిరి నగరాల పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ.91 దాటింది. 
 

click me!
Last Updated Sep 24, 2018, 12:49 PM IST
click me!