
పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ ధర నేడు భారీగా లాభపడింది. గురువారం ఓ సమయంలో ఏకంగా 13 శాతం ఎగిసిపడింది. గత నాలుగు నెలల కాలంలో ఇది గరిష్ట పెరుగుదల. పేటీఎం స్టాక్ దాదాపు 9 శాతం లాభపడి రూ.571 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో రూ.524 వద్ద ముగిసింది. గురువారం నష్టాల్లోనే రూ.522 వద్ద ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత అంతకంతకూ ఎగిసిపడింది. ఇలా మధ్యాహ్నం రెండుసార్లు రూ.590ని దాటింది. ఓ సమయంలో 13 శాతం ఎగబాకి రూ.595ను కూడా తాకింది.
అయితే ఆ తర్వాత క్షీణించింప్పటికీ 9 శాతం లాభంతోనే ఉంది. పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.37.06 వేల కోట్లను తాకింది. అయితే పేమెంట్ క్యూఆర్ కోడ్ ఆగ్రిగేటర్ పేటీఎం షేర్ భారీగా పతనమైంది. షేరు ఒడిదుడుకులపై సంస్థను బీఎస్ఈ వివరణ కోరింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా కంపెనీకి సంబంధించిన తాజా సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలని స్టాక్ ఎక్సేంజ్ ఆదేశించింది.
ఇందుకు స్పందనగా తమ బిజినెస్ ఫండమెంటల్స్ పటిష్ఠంగా ఉన్నాయని, సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీ షేరును ప్రభావితం చేసే సమాచారాన్ని ఎక్సేంజీలకు ఎప్పటికి అప్పుడు పంపిస్తున్నట్లు పేటీఎం వివరణ ఇచ్చింది. బుధవారం వివరణ తర్వాత కూడా షేర్ పతనం ఆగలేదు. ఈ షేర్ ధర రూ.524 వద్ద ముగిసింది. నాలుగు నెలల కాలంలో ఈ స్టాక్ రూ.4 లక్షల కోట్ల సంపదను కోల్పోయింది. అయితే బుధవారం వివరణ తర్వాత గురువారం స్వల్పంగా పెరగడం ఊరట.