మరో 18 నెలలూ బ్యాంకుల ‘మూడ్స్’ భేష్!

By rajesh yFirst Published Dec 4, 2018, 11:22 AM IST
Highlights

మరో 18 నెలల వరకు భారత బ్యాంకింగ్‌ రంగం స్థిరత్వానికి ఢోకా లేదని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ పేర్కొంది. మొండి బకాయిల భారంతో సతమతమవుతున్న ఈ రంగం ఆస్తుల నాణ్యత, క్రమంగా కోలుకుంటోందని సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. 

న్యూఢిల్లీ: మరో 18 నెలల వరకు భారత బ్యాంకింగ్‌ రంగం స్థిరత్వానికి ఢోకా లేదని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ పేర్కొంది. మొండి బకాయిల భారంతో సతమతమవుతున్న ఈ రంగం ఆస్తుల నాణ్యత, క్రమంగా కోలుకుంటోందని సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. సమస్యలు ఉన్నా ఆర్థిక వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండడం, ఆస్తుల నాణ్యత మెరుగుపడటం ఇందుకు కలిసి వస్తాయని పేర్కొంది.
 
ఆస్తుల నాణ్యత, నిర్వహణ వాతావరణం, మూలధనం, నిధుల లభ్యత, లాభదాయకత, ఫండింగ్‌, ప్రభుత్వ మద్దతు, ఆయా బ్యాంకుల సామర్ధ్యాల ఆధారంగా మూడీస్‌ ఈ నివేదిక రూపొందించింది. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం 7.2 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం వరకు ఉండే అవకాశం ఉందని మూడీస్ అంచనా వేసింది. పెరుగుతున్న పెట్టుబడులు, వినియోగం దోహదం చేస్తాయని తెలిపింది. అయితే ఎన్‌బీఎ్‌ఫసీలు ఎదుర్కొంటున్న నిధుల కొరత, పెరుగుతున్న వడ్డీ రేట్లు అభివృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించింది.
 
బ్యాంకుల మొండి బాకీ ఖాతాల ప్రక్షాళన చివరి దశకు చేరుకోవడంతో వాటి ఆస్తుల నాణ్యతా మెరుగుపడుతోందని మూడీస్‌ తన నివేదికలో పేర్కొంది. కార్పొరేట్‌ రుణాల పరిష్కార ప్రక్రియ వేగం పుంజుకున్నందున మొండి బాకీల వసూళ్లు పెరుగుతాయని అంచనా వేసింది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడడం అనే విషయం, పెద్ద పెద్ద కంపెనీల నుంచి రావలసిన మొండి బాకీల వసూళ్లపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
 
కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) మూల ధన పరిస్థితి ఇప్పటికీ బలహీనంగానే ఉన్నదని మూడీస్‌ తన నివేదికలో గుర్తు చేసింది. ఇందుకోసం ఈ బ్యాంకులు తమ కనీస మూలధన అవసరాల కోసం, ప్రభుత్వంపై ఆధారపడడం మినహా మరోమార్గంలేదని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో బ్యాంకులకు అవసరమైన మూలధన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నట్టు తెలిపింది.
 
నిధుల సమీకరణ ఖర్చులు అధికంగా ఉన్నందున పీఎస్బీల లాభదాయకత అంతంత మాత్రమేనని మూడీస్‌ అంచనా. గతంతో పోలిస్తే ముందు ముందు ఈ బ్యాంకుల లాభదాయకత కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉందని అంచనా వేసింది. బ్యాంకింగ్‌ ఆస్తుల్లో 70 శాతం వాటా ఉన్న దేశంలోని 15 వాణిజ్య బ్యాంకుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి మూడీస్‌ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో 11 పీఎస్‌బీలు. ప్రైవేట్‌ బ్యాంకులతో పోలిస్తే వీటి ఆర్థిక మూలాలు అంత పటిష్టంగా లేవని తెలిపింది.

click me!