జెట్ ఎయిర్‌వేస్ మేమే నిర్వహిస్తాం: ఒక్క ఛాన్స్ అంటున్న ఉద్యోగులు

By Siva KodatiFirst Published Apr 30, 2019, 10:58 AM IST
Highlights

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఈ నెల 17న మూతపడిన జెట్ ఎయిర్వేస్ సంస్థను తామే నడుపుతామని జెట్ ఉద్యోగ సంఘాల కన్సార్టియం ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్‍కు లేఖ రాసింది. 

తీవ్ర ఆర్థిక సంక్షోభం మధ్య కొద్ది రోజుల క్రితం మూతపడిన జెట్‌ ఎయిర్వేస్ సంస్థను తామే నడుపుతామని, అందుకు తమకు అనుమతి ఇవ్వాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌కు కంపెనీ సీనియర్‌ ఉద్యోగులు కొందరు లేఖ రాశారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల కన్సార్షియం పేరిట వారు సోమవారం ఈ లేఖ రాశారు.

కొంత మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.3 వేల కోట్లు, ఉద్యోగుల కన్సార్షియం నుంచి రూ.4 వేల కోట్లు మొత్తం రూ.7 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు తెలిపారు. తమకు ఎంప్లాయీస్‌ స్టాక్‌ ఆప్షన్‌ కింద వచ్చిన వాటాలు తనఖా పెట్టి రూ.4 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. 

తమతో చేతులు కలిపి ఇన్వెస్ట్‌ చేసేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని, కానీ వారి పేర్లు ప్రస్తుతం తాము వెల్లడించలేమని జెట్ ఎయిర్వేస్ సీనియర్ ఉద్యోగులు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల కన్సార్షియంను ఆసక్తి గల బిడ్డర్‌గా పరిగణించి తమను ప్రాథమిక చర్చలకు ఆహ్వానించాలని కోరారు. 

ఈ లేఖపై జెట్‌ ఎయిర్‌వేస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) కెప్టెన్‌ పీపీసింగ్‌, కంపెనీ మానవ వనరుల విభాగం మేనేజర్‌ బీబీసింగ్‌, మరి కొందరు సీనియర్‌ ఉద్యోగులు సంతకాలు చేశారు.

తమకు కంపెనీ విలువ తెలుసని, ఉద్యోగులుగా కంపెనీని ఎలా పట్టాల పైకి తేవచ్చో తమకు పూర్తి అవగాహన ఉన్నదని ఇండియన్‌ పైలట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి కెప్టెన్‌ అశ్వని త్యాగి అన్నారు. ఆయన కూడా ఆ లేఖపై సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.
 
తమ ప్రణాళికను బ్యాంకులు, ప్రభుత్వం పరిశీలించగలవని ఆశాభావం ఇండియన్‌ పైలట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి కెప్టెన్‌ అశ్వని త్యాగి  ప్రకటించారు. వివిధ ఉద్యోగుల బృందాల మధ్య విస్తృత స్థాయిలో చర్చించాకే తాము బిడ్‌ చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల డీరిజిస్ర్టేషన్‌, ఇతర కంపెనీలకు స్లాట్ల కేటాయింపు వంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని కూడా ఇండియన్‌ పైలట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి కెప్టెన్‌ అశ్వని త్యాగి  కోరారు.

జెట్‌ ఎయిర్వేస్ సంస్థ స్లాట్లను ఇతర పోటీ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించినట్టయితే బిడ్డర్లు కంపెనీపై ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉన్నదన్న ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగుల కన్సార్షియం ఈ లేఖ రాసింది. 

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉన్న 440 స్లాట్లను పోటీ విమానయాన సంస్థలకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే జెట్‌ ఎయిర్‌వేస్ చెందిన కొన్ని విమానాలను ఇప్పటికే స్పైస్‌జెట్‌, విస్తారావంటి కంపెనీలకు లీజుకు ఇచ్చేశారు. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ కోసం ఎతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌, టీపీజీ క్యాపిటల్‌, ఇండిగో పార్టనర్స్‌, ఎన్‌ఐఐఎఫ్ లను బిడ్డర్లుగా ఎంపిక చేశారు. ఆయా కంపెనీలు తమ బిడ్లను మే 10వ తేదీ లోగా అందించాల్సి ఉంటుంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ వివిధ బ్యాంకులకు రూ.8,400 కోట్ల బకాయి ఉంది. అయితే జెట్ ఎయిర్వేస్ ఉద్యోగ సంఘాల బిడ్ వెనుక సంస్థ మాజీ చైర్మన్, వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ ఉన్నారని వార్తలొచ్చాయి. నరేశ్ గోయల్ అంటేనే ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వ్యతిరేకిస్తున్నారని సమాచారం.    

click me!