నథింగ్ కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ 3ని జూలై 2025లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. నథింగ్ ఫోన్ 3లో గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హై-ఎండ్ పెర్ఫార్మెన్స్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో వస్తుందని కూడా అనుకుంటున్నారు. తెలిసిన సమాచారం ప్రకారం ఫోన్ ఫీచర్లు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలిసిన సమాచారం ప్రకారం నథింగ్ ఫోన్ 3లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది గతంలో వచ్చిన నథింగ్ ఫోన్ 2లో వాడిన స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 కంటే మెరుగైనదిగా ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఫోన్ డిజైన్ విషయంలో నథింగ్ సంస్థకు పేరు రావడానికి కారణం ట్రాన్స్‌పరెన్సీ. వెనుక భాగం క్లియర్‌గా కనిపించేలా ఉంటుందని సమాచారం. అయితే లోపల ఉండే భాగాల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశముంది.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ గురించి. ఈ ఫీచర్‌ను గత రెండు ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా నిలిపిన నథింగ్ సంస్థ..ఈసారి గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను తొలగించవచ్చని రూమర్స్ ఉన్నాయి. X (మాజీ Twitter)లో "We killed the Glyph Interface" అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయడంతో ఈ వాదనలు బలపడుతున్నాయి.
నథింగ్ ఫోన్ 3లో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.0 పనిచేస్తుంది. ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే ఇది 6.77-ఇంచ్ అమోల్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుందని అంచనా. అలాగే 5,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉండే అవకాశం ఉంది.
కెమెరా అంశంలోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరంగా అభివృద్ధి కనిపించనుంది. ప్రత్యేకించి ఏఐ ఆధారిత ఫోటోగ్రఫీ, వీడియో ఫీచర్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. మీడియా, గేమింగ్‌కి ఈ ఫోన్ చాలా బాగుంటుంది.
ధర విషయానికి వస్తే ఇటీవల ఓ కార్యక్రమంలో నథింగ్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై మాట్లాడుతూ ఈ ఫోన్ ధర సుమారు GBP 800 (భారత కరెన్సీలో సుమారు రూ.90,000) ఉండవచ్చని సూచించారు. ఇది గతంలో వచ్చిన నథింగ్ ఫోన్ 2 ప్రారంభ ధర అయిన రూ.44,999తో పోలిస్తే భారీ పెరుగుదల అని చెప్పొచ్చు.