ఆర్థిక రంగం బలోపేతానికి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపనలతో 2021 జీడీపీ వృద్ధి తగ్గుదలలో పెద్దగా మార్పులు ఉండవని బ్యాంక్ ఆఫ్ అమెరికా, నొమురా వంటి అనలిస్ట్ సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ చర్యలు తక్షణమే ప్రభావం చూపవని, దీర్ఘకాలిక వృద్ధికి ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ, ప్రవేశపెట్టబోయే సంస్కరణలు 2021 జీడీపీ వృద్ధిని పెంచలేవని విశ్లేషకులు తేల్చేశారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా భారత జీడీపీ వృద్ధిలో తగ్గుదల 0.1 శాతం, 5.0 శాతంగానే ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా, నోమురా విశ్లేషకులు అంచనా వేశారు.
కరోనా సంక్షోభం కారణంగా పతనమైన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ఇటీవలే ప్రకటించారు ప్రధాని నేరేంద్ర మోదీ. ఇది జీడీపీలో 10 శాతమని వివరించారు. దీనికి సంబంధించిన ప్రత్యేకతలను, సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్విడతల వారీగా ఐదు రోజులు వెల్లడించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ చర్యలు వ్యాపార సంస్థల స్వల్పకాలిక సవాళ్లను ఎదుర్కొనేందుకు దోహదపడవని, మూడేళ్ల పాటు మధ్యస్థ కాల వృద్ధికే ఉపయోగపడతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా, నోమురా పేర్కొన్నాయి. దీర్ఘకాలంలో మూలధనాన్ని ఆకర్షిస్తాయని, జీడీపీ వృద్ధిపై అసలు ఎలాంటి ఫ్రభావం ఉండదని స్పష్టం చేశాయి.
also read స్వీగ్గి షాకింగ్ న్యూస్: ఉద్యోగుల తొలగింపు.. క్లౌడ్ కిచెన్స్ మూసివేత..
వ్యవసాయం, మైనింగ్, విద్యుత్, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అన్ని ప్రభుత్వ రంగాల్లో ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేయడం వల్ల కాలక్రమేణా వృద్ధి సాధ్యమవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా వివరించింది. స్వల్పకాలంలో జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిలో 12 శాతం తగ్గుదల నమోదవుతుందని, 2021లో ఇది 0.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
ప్యాకేజీ కారణంగా ఆర్థిక లోటు 0.8 శాతంగానే ఉంటుందని, 2021 ఆర్థిక సంవత్సరం 7 శాతం వ్యత్యాసంతో ముగియవచ్చని నోమురా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా సంక్షోభ కాలంలో రాజకీయంగా సున్నితమైన సంస్కరణలు చేపట్టడం ఆహ్వానించదగ్గ విషయమని పేర్కొన్నది.
అక్టోబర్ నెలాఖరుకల్లా రిజర్వ్ బ్యాంక్ 0.75 శాతం కంటే ఎక్కువ వడ్డీరేట్లలో కోత విధిస్తుందని, ఆర్థిక లోటును గుర్తించడానికి 75 బిలియన్ డాలర్ల బహిరంగ మార్కెట్ కార్యకలాపాలను నిర్వహిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది.