పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి వ్యతిరేకంగా సీబీఐ కీలక సాక్ష్యాలు సంపాదించింది. ఆయన సంస్థకు చెందిన ఆరుగురు డైరెక్టర్లతో నీరవ్ కు వ్యతిరేకంగా వీడియో సాక్ష్యాలను లండన్ కోర్టులో సమర్పించింది.
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.14 వేల కోట్ల మోసంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ అప్పగింత కేసులో సీబీఐ ముందడుగు వేసింది. ఈ కేసులో నీరవ్ మోదీకి వ్యతిరేకంగా కీలక సాక్ష్యాలను సంపాదించింది. తనను చంపుతానని బెదిరించినట్లు ఆయన సంస్థలతో సంబంధం ఉన్న ఓ డమ్మీ డైరెక్టర్ వాంగ్మూలాన్ని వీడియో సాక్ష్యం రూపంలో న్యాయస్థానానికి నివేదించారు.
నీరవ్ మోదీని భారత్‌కు అప్పగింత కేసు విచారణలో భాగంగా సీబీఐ ఈ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. లండన్ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టులో ఈ రికార్డు చేసిన వీడియోను ప్రదర్శించారు. తమను నీరవ్ సోదరుడు నిహాల్ మోదీ బెదిరించినట్లు ఆయనకు సంబంధించిన కంపెనీలకు చెందిన ఆరుగురు నకిలీ డైరెక్టర్లు ఆ వీడియో వాంగ్మూలంలో వెల్లడించారు.
‘నా పేరు ఆశిష్ కుమార్ మోహన్‌భాయ్ లాడ్. హాంకాంగ్‌లో సన్‌షైన్ జెమ్స్ లిమిటెడ్, దుబాయ్‌లో యునిటి ట్రేడింగ్ ఎఫ్‌జెడ్‌ఈ పేరుతో ఉన్న సంస్థలకు నామమాత్రపు యజమానిని. నీరవ్ మోదీ నాకు ఫోన్ చేశారు. దుర్భాషలాడారు. చంపుతానన్నారు’ అని చెప్పారు.
also read కరోనా కష్టాలకు ‘కరెన్సీ ముద్రణ’తోనే చెక్.. కానీ ద్రవ్యలోటు సంగతేంటి?
ఆశీష్‌తోపాటు రుషభ్ జెత్వా, సోనూ మెహెతా, శ్రీధర్ మైకర్, నీలేష్ కుమార్ బల్వంత్‌రాయ్ మిస్త్రీల వాంగ్మూలాలనూ ప్రదర్శించారు. నీరవ్ మోదీ సోదరుడు నిహాల్ మోదీ అయిష్టంగా నకిలీ పత్రాలపై తమతో సంతకాలు చేయించారని ఆరోపించారు.
దుబాయ్‌లో ఉన్న తమను ఆ ప్రాంతం విడిచి ఈజిప్ట్ రాజధాని కైరో రావాలని బెదిరించినట్లు వారు తెలిపారు. తమ పాస్‌పోర్ట్‌లు నీరవ్ మోదీ సోదరుల వద్ద ఉన్నందున అవి తిరిగి ఇవ్వబోరన్న భయంతో ఆ పత్రాలపై సంతకం చేసినట్లు వారు తెలిపారు. నీరవ్ మోదీ కేసులో భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాదిస్తున్నది.
నీరవ్ భారత్‌కు అప్పగింత కేసును సెప్టెంబర్ 7వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు లండన్ కోర్టు ప్రకటించింది. అయితే జూన్ 11న వీడియో లింక్ ద్వారా జైలు నుంచే రిమాండ్‌కు సంబంధించిన విచారణ చేపడుతామని డిస్ట్రిక్ట్ జడ్జి సామ్యూల్ గూజీ తెలిపారు.
నీరవ్ మోదీని తిరిగి దేశానికి రప్పించాలన్న భారత విజ్ఞప్తిని బ్రిటన్ 2019 ఫిబ్రవరిలో ఆమోదించింది. ఆ మరుసటి నెలలోనే ఆయనను అరెస్ట్ చేశారు. నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్ వర్త్ జైలులో ఉన్నారు.