నీరవ్ సాకు: రావణుడిల్లా చూస్తున్నారు.. భారత్‌కు రాలేనని కప్పదాట్లు

By sivanagaprasad kodatiFirst Published Dec 2, 2018, 12:21 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ.13 వేల కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడి.. ఆపై విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తునుంచి తప్పించుకోవడానికి సాకులు వెతుకుతున్నారు. భారతీయులు తనను కొట్టి చంపేస్తారన్న భయం వెంటాడుతున్నదని వాదిస్తున్నారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో (పీఎన్బీ) భారీ కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ తనను తాను చట్టం, శిక్షల నుంచి కాపాడుకొనేందుకు ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు. తనను రావణుడిగా చూస్తున్నారని, తాజాగా తాను భారత్‌కు వస్తే ఇక్కడి ప్రజలు మూకుమ్మడి దాడి చేసి చంపేస్తారేమోనన్న భయంతో ఉన్నారని నీరవ్‌ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అదేవిధంగా రక్షణ పరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశా లు ఉన్నాయని తెలిపారు. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 

నీరవ్‌ మోదీ భారత్‌కు రాలేరని, ఆయనను ప్రజలు రావణుడితో పోలుస్తున్నారని, మూకుమ్మడిగా దాడి చేసే చంపేస్తారేమోనని ఆయన భయపడుతున్నారని మోదీ న్యాయవాది విజయ్ అగర్వాల్‌ పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌) కోర్టుకు తెలిపారు. కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆయన వాదనలను ఖండించింది. ఆయన భద్రతకు ముప్పు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. 

పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద నీరవ్‌ మోడీని పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై పీఎంఎల్‌ఏ కోర్టు విచారణ జరిపిన నేపథ్యంలో నీరవ్‌ న్యాయవాది పైవిధంగా వాదించారు. అలాగే నీరవ్‌ వద్ద ఆర్థికపరమైన వివరాలు, సమాచారం ఏమీ లేదని, వాటిని చూసుకునే తన ఉద్యోగులను ఇప్పటికే ఈడీ కస్టడీలోకి తీసుకుందని తెలిపారు. 

అయితే నీరవ్‌ దర్యాప్తుకు సహకరించడం లేదని, ఈమెయిల్స్‌, సమన్లకు స్పందించడం లేదని ఈడీ కోర్టులో తెలిపింది. ఆయన భారత్‌కు రావాలనుకోవట్లేదని వాదించింది. దీనికి నీరవ్‌ న్యాయవాది స్పందిస్తూ నీరవ్‌ దర్యాప్తు సంస్థల మెయిల్స్‌కు స్పందిస్తున్నారని, తన భద్రతపై ఆందోళన వల్ల తాను భారత్‌కు రాలేకపోతున్నానని మోదీ జవాబు ఇస్తున్నారని న్యాయవాది తెలిపారు.

సీబీఐ, ఈడీలను ఉద్దేశించి నీరవ్‌ రాసిన లేఖలో.. ప్రయివేటు వ్యక్తులు, పీఎన్బీ కుంభకోణంలో అదుపు లోకి తీసుకున్న వారి కుటుంబ సభ్యులు, భూస్వాములు, అప్పులు ఇచ్చిన వాళ్లు, వినియోగదా రులు, పలువురి నుంచి ప్రాణ హాని ఉన్నదని తెలిపాడు. భారత్‌లో నా 50 అడుగుల దిష్టిబొమ్మను దహనం చేశారని గుర్తు చేశారు. 
 

click me!