అమెరికాలో చదువుకుంటే 20వేల హెచ్1బీ వీసాలు అదనం

By sivanagaprasad kodatiFirst Published Dec 2, 2018, 11:40 AM IST
Highlights

హెచ్1 బీ వీసా నిబంధనల్లో సంస్కరణలు ప్రతిపాదిస్తున్న ట్రంప్ సర్కార్.. అమెరికాలో మాస్టర్ డిగ్రీ చదివిన వారికి ప్రత్యేకంగా 20 వేల హెచ్1 బీ వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కోటా పూర్తయిన తర్వాత మిగిలిన దరఖాస్తులను మిగతా వాటితో కలిపి లాటరీ పద్దతిలో హెచ్1 బీ వీసా జారీ చేస్తారు. 

హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ప్రక్రియలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం కీలక మార్పులు ప్రతిపాదించింది. ఆ దిశగా భారీగానే కసరత్తులు చేస్తోంది. అమెరికాలో ఉన్నత కోర్సుల్లో విద్యాభ్యాసం వారికి దీనిలో పెద్దపీట వేసింది. మెరుగైన నైపుణ్యాలతోపాటు అత్యధిక వేతనాలు పొందే అర్హత కలిగిన విదేశీయులే లక్ష్యంగా వీటిని సిద్ధం చేసింది.

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకన్నా పై చదువులు చదువుకున్న వారు హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే అలాంటి వాటిలో నుంచి మొదటి 20వేల దరఖాస్తులను ఆ పరిమితి నుంచి మినహాయిస్తారు. వీరికి నేరుగా హెచ్1బీ వీసా లభిస్తుంది.

అయినా మరోవైపు సంస్థలు తమ హెచ్‌-1బీ దరఖాస్తులను ముందుగానే ఆన్‌లైన్‌లో అమెరికా పౌరసత్వం, వలసల సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌)కు సమర్పించాలని కొత్త నిబంధన తెచ్చింది. అమెరికా కాంగ్రెస్ నిర్ణయించే పరిమితి మేరకు 65 వేల మంది విదేశీ కార్మికులకు మాత్రమే హెచ్1 బీ వీసా ఇచ్చే సమయంలో ఈ నిబంధనలను పాటించాలని పేర్కొంది.

భారత ఐటీ సంస్థలు, నిపుణులు పెద్దయెత్తున ఈ వీసాల కోసం దరఖాస్తు చేసే సంగతి తెలిసిందే. ఏటా 65,000 హెచ్‌-1బీ వీసాలను అమెరికా జారీచేస్తుంది. అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ లేదా ఉన్నత విద్య అభ్యసించిన వారికి ఇచ్చే 20,000 వీసాలు వీటికి అదనం. 

ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం ఈ 20,000 వీసాల కోసం దరఖాస్తులను విడిగా సేకరిస్తారు. వీటిలో పరిమితికి సరిపడా ఎంపిక చేసిన అనంతరం మిగిలిన దరఖాస్తులను లాటరీ ద్వారా ఎంపిక చేసే సాధారణ దరఖాస్తుల్లో కలిపి 65,000 దరఖాస్తులను ఎంపిక చేస్తారు. ఈ విధానంలో తాజాగా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) మార్పులు ప్రతిపాదించింది. 

ఇకపై తొలుత ఉన్నత విద్య కేటగిరీ దరఖాస్తులను, సాధారణ హెచ్‌-1బీ దరఖాస్తులను కలిపి 65,000 ఎంపిక చేస్తారు. ఎంపిక అనంతరం మిగిలిన వాటిలో అమెరికా మాస్టర్‌ డిగ్రీ లేదా ఉన్నత విద్య అభ్యసించిన వారి దరఖాస్తులను వేరుచేస్తారు. వీటి నుంచి 20,000 వీసాలను ఎంపిక చేస్తారు. ఈ మార్పులతో అమెరికా మాస్టర్‌ డిగ్రీ లేదా ఉన్నత విద్య పట్టా ఉండేవారికి వీసాలు వచ్చే అవకాశం పెరుగుతుందని డీహెచ్‌ఎస్‌ తెలిపింది. 

మొత్తంగా 16 శాతం (5340 వీసాలు) వరకు ఎక్కువ వీసాలు అమెరికాలో విద్యాభ్యాసం చేసేవారికి దక్కనున్నట్లు అంచనా వేసింది. సోమవారం నుంచి జనవరి 2 వరకూ ప్రజలు ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలు తెలియజేయొచ్చని పేర్కొంది.

ప్రతిపాదిత మార్పులతో అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకన్నా ఉన్నత విద్యను అభ్యసించిన లబ్ధిదారుల సంఖ్య 16 శాతం (5,430 మంది ఉద్యోగులు) పెరుగవచ్చని డీహెచ్‌ఎస్ పేర్కొంది. ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగులను కోరుకునే సంస్థలు ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని తెలిపింది.

20వేల మంది భారతీయులు ఆశ్రయం కోరుతూ అభ్యర్థన 
2014 నుంచి 20వేల మందికిపైగా భారతీయులు ఆశ్రయం కోసం అభ్యర్థించారని డీహెచ్‌ఎస్‌ తెలిపింది. వీరిలో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉందని వివరించింది. ఉత్తర అమెరికా పంజాబీ సంఘం (ఎన్‌ఏపీఏ) సమాచారం కోరడంతో డీహెచ్‌ఎస్‌ స్పందించింది. 2014లో 2306 మంది, 2015లో 2971, 2016లో 4088, 2017లో 3656, 2018లో జూలై వరకు 7214 మంది ఆశ్రయం పొందారు. వీరిలో 848 మంది మహిళలు మాత్రమే ఉండటం గమనార్హం. 
 

click me!