UPI ట్రాన్సాక్షన్స్ లో కొత్త రూల్స్ రాబోతున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. UPI లిమిట్స్ పెంచడంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం లేని వినియోగదారులు కూడా పేమెంట్స్ చేసేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇవన్నీ జనవరి 1, 2025 నుంచి అమలు కానున్నాయి. మరి కొత్తగా అమలు కానున్న నిబంధనల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త సంవత్సరంలో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) నిబంధనల్లో కొత్త మార్పులు అమలులోకి రానున్నాయి. ఇది వినియోగదారులకు సాంకేతిక సేవలను మరింత చేరువ చేయనున్నాయి. ముఖ్యమైన మార్పుల్లో UPI 123 Pay కోసం ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచడం ఒకటి. ప్రజలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేసేలా చేయడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
UPI 123 Pay కోసం ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటికే ప్రకటించింది. గతంలో రూ.5,000 వరకే లిమిట్ ఉండగా, ఇప్పుడు రూ.10 వేల వరకు ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఇది వినియోగదారులను డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేలా ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. లిమిట్ పెంచడం వల్ల సింపుల్ గాను, ట్రాన్సపరెంట్ గాను లావాదేవీలు జరుగుతాయి.
ముఖ్యంగా స్థిరమైన ఇంటర్నెట్ యాక్సెస్ లేని వారికి UPI 123 Pay మరింత ఉపయోగకరంగా మారుతుంది. UPI 123Pay అనేది ఇంటర్నెట్ యాక్సెస్ లేని వినియోగదారుల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక సేవ. దీని ద్వారా వినియోగదారులు నాలుగు రకాల చెల్లింపులను చేయవచ్చు.
IVR నంబర్లు: వినియోగదారులు ఆటోమేటెడ్ వాయిస్ సిస్టమ్‌తో మాట్లాడుతూ పేమెంట్స్ చేయొచ్చు. అంటే కేవలం కంప్యూటర్ తో మాట్లాడుతూ అది చెప్పినట్లు చేస్తే సరిపోతుంది. ఈ సౌకర్యాన్ని చదువు లేని వారు కూడా సింపుల్ గా ఉపయోగించవచ్చు.
మిస్డ్ కాల్స్: ట్రాన్సాక్షన్స్ కోసం ప్రత్యేకించి కేటాయించిన నంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా చెల్లింపులను చేయవచ్చు. ఆయా నెట్వర్క్ లకు కేటాయించిన నంబర్లకు మిస్ కాల్ ఇస్తే ఒక మెసేజ్ రూపంలో ట్రాన్సాక్షన్స్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో ఉండే ఆప్షన్స్ ఎంపిక చేసుకోవడం ద్వారా ఈజీగా పేమెంట్స్ చేయవచ్చు.
OEM-యాప్‌లు: ఫీచర్ ఫోన్‌లలో ముందే ఇన్‌స్టాల్ అయి ఉన్న యాప్‌లు ఉపయోగించి లావాదేవీలు చేయొచ్చు. దీని వల్ల త్వరగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి.
సౌండ్ బేస్డ్ టెక్నాలజీ: లావాదేవీలను ధృవీకరించడానికి సౌండ్ వేవ్స్ ను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.
కొత్తగా వచ్చిన ఈ ఫీచర్స్ అన్నీ UPI 123 Pay ద్వారా సింపుల్ పద్ధతిలో చేయొచ్చు. వీటిని ఎక్కువగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలలోని వినియోగదారులు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది.
భద్రతను మెరుగుపరచడానికి అన్ని UPI 123Pay లావాదేవీలకు OTP ఆధారిత సేవ ఇప్పుడు తప్పనిసరి. ప్రతి ట్రాన్సాక్షన్ సరిగ్గా జరిగిందో లేదో ఇది నిర్ధారిస్తుంది. కొత్తగా మారిన ఈ రూల్స్ అన్నీ జనవరి 1, 2025 నాటికి అమలులోకి వస్తాయి. వినియోగదారులు కొత్త రూల్స్ ని ఉపయోగించుకొని సేఫ్ గా, సెక్యూర్ గా లావాదేవీలు చేయొచ్చు.
ఇది కూడా చదవండి: https://telugu.asianetnews.com/gallery/business/2024-year-ender-upi-payments-set-new-record-with-16-5-billion-transactions-in-2024-sns-sp416z