దుబాయ్, టోక్యోలను మించిన ముంబై: ప్రైవేట్ జెట్స్’లో న్యూయార్క్‌ టాప్

By rajesh yFirst Published Apr 13, 2019, 1:04 PM IST
Highlights

ప్రైవేట్ జెట్ విమానాల ప్రయాణంలో దుబాయ్‌,టోక్యో కంటే ముంబై విమానాశ్రయమే ముందు వరుసలో నిలిచింది. కాకపోతే ఈ జాబితాలో అగ్రస్థానంలో న్యూయార్క్‌ నిలిచింది. భారతదేశంలోని కుబేరులంతా ముంబైలో ఉన్నట్లే గ్లోబల్ బిలియనీర్లు అంతా న్యూయార్క్‌లోనే ఉన్నారు

ముంబై: కార్పొరేట్‌ ప్రముఖులు, కుబేరులతోపాటు ఉన్నతస్థాయి పాలనావేత్తలు ప్రైవేట్ జెట్‌ విమానాలను వినియోగిస్తుంటారు. గతేడాదిలో దుబాయ్, టోక్యో కంటే భారత్ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నుంచి వివిధ దేశాల్లోని నిర్దేశిత ప్రాంతాలకు బయలుదేరి వెళ్లిన ప్రైవేట్ జెట్‌ విమానాల సంఖ్యే అధికమని తేలింది.

గతేడాదిలో ముంబై నుంచి ప్రైవేట్‌ జెట్‌ విమానాలు 1516 బయలు దేరాయి. దుబాయ్ నుంచి బయలుదేరిన 1400 సర్వీసులతో పోలిస్తే ఇది 8.28 శాతం అధికం. జపాన్‌ రాజధాని టోక్యో నుంచి ప్రారంభమైన సర్వీసులు 1202 కంటే 20 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

ప్రైవేట్ జెట్ విమానాలను వాడే కుబేరుల జాబితాలో అగ్రస్థానం మాత్రం న్యూయార్క్‌దే. ప్రపంచంలోనే అత్యధిక కుబేరులు నివసించే న్యూయార్క్‌ నగరం నుంచి 2018లో 66,968 ప్రైవేట్‌ జెట్‌ విమానాలు బయలుదేరాయి. 

ఈ జాబితాలో ముంబై స్థానం 146 అని, కుబేరుల పర్యటక శైలిపై నివేదిక రూపొందించిన నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది. దేశీయంగా ముంబైలోనే కుబేరులు ఎక్కువ మంది ఉంటున్నారు.

ఒకే రన్‌వే కలిగిన ముంబై విమానాశ్రయం, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాటిల్లో ఒకటిగానూ గుర్తింపు పొందింది. వరుసగా మూడో ఏడాది కూడా రోజూ దాదాపు 1,000 విమానాల రాకపోకలకు వీలు కల్పించిన ఘనత సొంతం చేసుకుంది. 

లండన్‌ సమీపంలోని గాట్విక్‌ దీనికంటే ముందు ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన కేంద్రంగా దుబాయ్ విమానాశ్రయం నిలుస్తోంది.

రాకపోకలు అధికంగా సాగించే ప్రైవేట్‌ జెట్‌ విమానాలు ఎక్కువ ఉన్న దేశాల్లో అగ్రస్థానం ఉత్తర అమెరికాదే. అక్కడ 13685 ప్రైవేట్‌ జెట్‌లున్నాయి. తరవాత స్థానాల్లో ఐరోపా, రష్యా, పాత సోవియట్‌ యూనియన్‌ సభ్య దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో 2879 చొప్పున జెట్‌ విమానాలు ఉన్నాయి.

తదుపరి స్థానాల్లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, జర్మనీల నుంచి ప్రైవేట్ యుద్ద విమానాలు అత్యధికంగా బయలుదేరి వెళ్లాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. అమెరికా, ఫ్రాన్స్‌ల నుంచి జూన్‌లో ఎక్కువగా, బ్రిటన్‌ నుంచి ఏప్రిల్‌లో అధికంగా పర్యటనలకు వెళ్తున్నారు.

తమకు అనుకూలంగా ఉండే వాతావరణం, అభిరుచికి తగ్గ ప్రదేశాలనే తమ పర్యటనల కోసం కుబేరులు ఎంచుకుంటున్నారని నివేదిక తెలిపింది. అమెరికన్లు మెక్సికో, కెనడాలకు వెళ్తుంటే, ఆస్ట్రేలియా సంపన్నులు న్యూజిలాండ్‌ను సందర్శిస్తున్నారని పేర్కొంది.

click me!