రిలయన్స్ జియో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ముఖేష్ అంబానీ.. ఆకాశ్‌కి అప్పగింత

By Siva KodatiFirst Published Jun 28, 2022, 5:41 PM IST
Highlights

దేశంలోనే అత్యంత సంపన్నుడు, రియలన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీ తన వ్యాపార బాధ్యతలను వారసులకు అప్పగించే ప్రణాళికను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా రిలయన్స్ జియో సారథ్య బాధ్యతల నుంచి ఆయన తప్పుకుని కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు.  
 

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ (reliance industries) అధినేత ముకేశ్ అంబానీ (mukesh ambani) తమ కంపెనీ టెలికాం విభాగమైన జియో (jio) సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ బోర్డుకు (reliance jio infocomm limited) ఆయన రాజీనామా చేశారు. ఈ కంపెనీ పగ్గాలను తనయుడు ఆకాశ్‌ అంబానీకి (akash ambani) అప్పగించారు. ఈ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌ సందర్భంగా రిలయన్స్‌ జియో వెల్లడించింది.  

జూన్‌ 27న ముకేశ్ అంబానీ రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆకాశ్ అంబానీని కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ... ఛైర్మన్‌గా నియమించినట్లు పేర్కొంది. ఇక మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పంకజ్‌ మోహన్‌ పవార్‌, స్వతంత్ర డైరెక్టర్లుగా రమీందర్‌ సింగ్‌ గుజ్రాల్‌, కేవీ ఛౌదరీలను నియమించినట్లు తెలిపింది.  

ALso REad:Reliance Buying: ముఖేష్ అంబానీ చేతికి అమెరికన్ కాస్మొటిక్స్..!

అయితే జియో ప్లాట్‌ఫామ్‌ లిమిటెడ్‌కు మాత్రం ముకేశ్‌ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. ముకేశ్‌ అంబానీ తన వ్యాపార బాధ్యతలను వారసులకు అప్పగించే ప్రణాళికలో భాగంగానే ఈ మార్పు జరిగినట్లు కార్పోరేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆకాశ్‌ 2014లో జియో బోర్డులో చేరారు.  

click me!