కరోనా మహమ్మారి వల్ల పలు మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విడుదల చేయడం తాత్కాలికంగా వాయిదా వేశాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు ఆంక్షలు సడలిస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల పలు మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విడుదల చేయడం తాత్కాలికంగా వాయిదా వేశాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు ఆంక్షలు సడలిస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నెమ్మదిగా ఒక్కో స్మార్ట్ ఫోన్ల తయారీ కంపనీ తమ ఉత్పత్తులను విపణిలోకి తీసుకు వస్తోంది.
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘మోటరోలా వన్ సిరీస్’లో ఓ కొత్త మొబైల్ ఫోన్ మంగళవారం భారత విపణికి పరిచయం చేసింది. ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ కింద వన్ ఫ్యూజిన్ ప్లస్ పేరుతో దీనిని తీసుకొచ్చింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల విభాగంలో దూసుకు వెళుతున్న పోకో ఎక్స్2 మోడల్ ఫోన్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వనున్నదని భావిస్తున్నారు.
మోటోరోలా వన్ ఫ్యూజిన్ ప్లస్ మొబైల్ ఫోన్ ధర రూ.16,999గా నిర్ణయించారు. అయితే పోకో ఎక్స్2 ప్రారంభ ధర రూ.17,499తో పోలిస్తే భారత్ వేరియంట్‌లో అప్ గ్రేడెడ్ వర్షన్ ఫోన్ తీసుకువచ్చింది.
గ్లోబల్ మోడల్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్ వినియోగించగా, ఇందులో స్నాప్ డ్రాగన్ 730 జీ ప్రాసెసర్ వాడారు. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో ఈ ఫోన్ రానున్నది. మూన్ లైట్ వైట్, ట్విలైట్ బ్లూ రంగుల్లో ఇది లభించనున్నది. ఈ నెల 24న ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో సేల్ కు రానున్నది.
వన్ ఫ్యూజిన్ ప్లస్ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ ప్యానెల్ డిస్ ప్లేతో రానున్నది. బ్యాకప్ క్వాడ్ కెమెరా సెటప్ అమర్చారు. 64 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు 8 మెగా పిక్సెల్, ఆల్ట్రా వైడ్ యాంగిల్, మెగా పిక్సెల్ మాక్రో, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్పీల కోసం ముందువైపు 16 ఎంపీ పాప్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్సులో 18 వాట్ ఫాస్ట్ చార్జర్ అందిస్తున్నది.