భారత్ వృద్ధి రేటుపై ‘మూడీస్’ డౌట్స్.. 6.2 శాతమే

By Arun Kumar PFirst Published Aug 25, 2019, 2:18 PM IST
Highlights

భారత వృద్ధిరేటుపై గతంలో ప్రకటించిన అంచనాలను ‘మూడీస్’ తగ్గించివేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.2 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది. వచ్చే ఏడాది 6.7 శాతంగా నమోదవుతుందని, ఇది చైనా జీడీపీతో సమానమని తెలిపింది.

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో భారత వృద్ధిరేటుపై అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ సందిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి 6.2 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతకు ముందు ఇదే సంస్థ భారత్‌ వృద్ధి ఈ ఏడాది 6.8 శాతం మేర నమోదు కావచ్చని అంచనా కట్టింది.

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలత పరిస్థితుల నేపథ్యంలో ఆ అంచనాలను 6.2 శాతానికి సవరించింది. వచ్చే సంవత్సరంలో భారత వృద్ధి 6.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొంది. దీనిలో కూడా 0.6శాతం కోత విధించింది. ఈ అంచనాలే నిజమైతే భారత్‌ వృద్ధిరేటును చైనా వృద్ధిరేటు సమానం చేస్తుంది. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో చైనా వృద్ధిరేటు 5.8శాతానికి పడిపోతుందని మూడీస్‌ అంచనావేసింది. మూడీస్‌ ఆసియాలోని మొత్తం 8దేశాల వృద్ధిరేటు తగ్గిపోతుందని ప్రకటించింది. వీటిల్లో భారత్‌ కూడా ఉంది. భారత్‌, జపాన్‌, ఫిలిప్పీన్స్‌లో వృద్ధిరేటు పతనం కావడానికి దేశీయ డిమాండ్లు పడిపోవడం ప్రధాన కారణంగా నిలుస్తుందని పేర్కొంది. ఎగుమతులు తగ్గడం దీనికి ఆజ్యం పోస్తుందని పేర్కొంది. 

ఇటీవలే మరో రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ కూడా భారత జీడీపీ వృద్ధి అంచనాలను సవరించిన సంగతి తెలిసిందే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతం వృద్ధిరేటు నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసిన క్రిసిల్‌.. ఆ తర్వాత దాన్ని 6.9 శాతానికి తగ్గించింది. వృద్ధిరేటు మందగించనున్నా అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలవనుందని మూడీస్‌ పేర్కొంది. 

ముఖ్యంగా భారత్‌పై ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల కంటే దేశీయ పరిస్థితులే అధిక ప్రభావం చూపిస్తాయని మూడీస్‌ హెచ్చిరించిది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు ఆర్థికంగా బాగోకపోవడం, నిరుద్యోగం, ఎన్‌బీఎఫ్‌సీలపై నగదు ఒత్తిళ్లు వంటి అంశాలు ప్రభావం చూపుతాయని మూడీస్‌ వెల్లడించింది. 
 

click me!