
ఇటీవల కాలంలో విమానాల్లో ఉపయోగించే జెట్ ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్క జూన్‌లోనే ఇంధన ధరలు 120 శాతం వరకు పెరిగాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ రోజురోజుకి క్షీణిస్తుంది. దీంతో ఏవియేషన్ సెక్టార్‌లో లాభాల సంగతి అటుంచి వస్తున్న నష్టాలను అదుపు చేయడం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. చివరకు ధరల పెంపు ఒక్కటే మార్గంగా ఏవియేషన్ సర్వీస్ ప్రొవైడర్లు డిసైడ్ అవుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ సంస్థ మనుగడ కొనసాగించాలంటే ఛార్జీలు పెంచడం మినహా మరో మార్గం లేదని స్పైస్‌జెట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. వివిధ మార్గాల్లో 10 నుంచి 15 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. ధరలు పెంచినా నష్టాల నుంచి తప్పించుకోవడం కష్టమని.. పన్నులు తగ్గించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కూడా ఆయన కోరారు.
కోవిడ్ తర్వాత ప్రయాణాలు తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. ఈ తరుణంలో ధరల పెంపుకు విమానయాన సంస్థలు విముఖంగా ఉన్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఛార్జీలు పెంచకపోతే మనుగడ కష్టమనే భావనలోకి స్పైస్‌జెట్‌తో పాటు ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం ఉన్నాయి. ఈ ఛార్జీలు పెంపు స్పైస్‌జెట్‌తో మొదలైందని.. రాబోయే రోజుల్లో ఇతర సంస్థల నుంచి ధరల పెంపు ప్రకటనలు వెలువడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
2021 జూన్ నుండి ఏటీఎఫ్ ధర 120 శాతానికి పైగా పెరిగిందని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన దేశంలో ధరలు భారీగా పెరిగాయని, ఏటీఎఫ్ పైన పన్నులు తగ్గించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. గత కొద్ది నెలలుగా విమాన ఇంధన ధరలు భరించేందుకు సాధ్యమైనంత మేరకు ప్రయత్నాలు చేశామని, తమ నిర్వహణ వ్యయాల్లో దాదాపు 50 శాతానికి పైగా ఇంధనానికే ఖర్చు అవుతోందన్నారు. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ కూడా క్షీణిస్తోందని, ఎయిర్ లైన్స్ పైన ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తోందన్నారు.
నిర్వహణ ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కాబట్టి వీటిని భరించాలంటే ధరలను కనీసం పది శాతం నుండి పదిహేను శాతం పెంచక తప్పని పరిస్థితి అన్నారు. అజయ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పైస్ జెట్ షేర్లపై ప్రతికూల ప్రభావం కనిపించాయి. మధ్యాహ్నం గం.12.30 సమయానికి దాదాపు 7 శాతం పతనమైంది. ఇండిగో షేర్ కూడా 4 శాతానికి పైగా పతనమైంది.