పండగే పండగ... వారానికి మూడు వీక్లీ ఆఫ్‌లు...

By Sandra Ashok Kumar  |  First Published Nov 4, 2019, 4:40 PM IST

మైక్రోసాఫ్ట్‌ జపాన్‌లో తమ ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజుల వీక్‌ఆఫ్‌ను ప్రకటించి మెరుగైన ఫలితాలు రాబట్టింది. ఉద్యోగులు తమ ఇంటి పనులు, కార్యాలయ పనుల మధ్య సమతూకం పాటించేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్‌ ఒక నెలపాటు 2300 మంది ఉద్యోగులకు మూడు రోజుల వీక్లీ ఆఫ్‌ను ప్రవేశపెట్టింది. 


టోక్యో : ప్రపంచంలో అతి పెద్ద కంపెనీలో ఒకటైన మైక్రోసాఫ్ట్ తమ సంస్థ ఉద్యోగుల కోసం ఒక మంచి ఆలోచన చేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇది ఒక ముల్టీ నేషనల్ కంపెనీ, టెక్నాలజి , సాఫ్ట్ వేర్ పరంగా మంచి పేరు పొందిన సంస్థలలో ఒకటి. అయితే ఉద్యోగులతో వీలైనంత ఎక్కువ సమయం పని చేయించుకొని లాభాలు పొందవచ్చు అనే ఆలోచనలు ఏమాత్రం పెట్టుకోలేదని మరోసారి తేటతెల్లమైంది.

వారాంతంలో మల్టీ నేషనల్ కంపెనీలు రెండు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత ఉత్పాదకత పెరగడం గమనించిన కార్పొరేట్‌ కంపెనీలు ఇప్పుడు వారానికి మూడు రోజుల వీక్లీ ఆఫ్‌ను పరిశీలిస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌ జపాన్‌లో తమ ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజుల వీక్‌ఆఫ్‌ను ప్రకటించి మెరుగైన ఫలితాలు రాబట్టింది.

Latest Videos

ఉద్యోగులు తమ ఇంటి పనులు, కార్యాలయ పనుల మధ్య సమతూకం పాటించేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్‌ ఒక నెలపాటు 2300 మంది ఉద్యోగులకు మూడు రోజుల వీక్లీ ఆఫ్‌ను ప్రవేశపెట్టింది. వర్కింగ్‌ రిఫామ్‌ ప్రాజెక్టు కింద ఉద్యోగులకు ఇచ్చిన ఈ వెసులుబాటు అద్భుత ఫలితాలను రాబట్టింది.

మూడు రోజుల వీకెండ్‌ ఫలితంగా ఉద్యోగులు అందించిన ఉత్పాదాకత ఏకంగా 39.9 శాతం పెరిగింది. ఉత్పాదాకత పెరగడంతో పాటు అదనంగా ఇచ్చిన మరో వీక్‌ ఆఫ్‌తో 23.1 శాతం విద్యుత్‌ ఆదా అవడం సంస్థకు కలిసివచ్చింది.

వారంలో నాలుగు రోజులే పనిచేయడంతో లక్ష్యాలను పూర్తి చేసేందుకు సమావేశాలను రద్దు చేయడం, ముఖాముఖి భేటీల స్ధానంలో వర్చువల్‌ సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ఉత్పాదకత గణనీయంగా పెరిగింది.

నెలరోజల పాటు పైలట్‌ ప్రాజెక్టుగా అమలైన వారానికి మూడు రోజుల సెలవు తమకు చాలా సంతృప్తికరంగా ఉందని 92.1 శాతం మంది ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో  మరోసారి ఈ తరహా నాలుగు రోజుల పనిదినం పద్దతిని పరిశీలించేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధమైంది. మరోవైపు సాధారణ వ్యాపారాలకు మైక్రోసాఫ్ట్‌ భిన్నంగా ఉంటుందని, ఇది అన్ని కార్యాలయాల్లో మెరుగైన ఫలితాలు ఇస్తుందని చెప్పలేమని నిపుణులు పేర్కొన్నారు.
 

click me!