ఐదేళ్లలో 3,427 బ్యాంకుల... మూసివేత...ఎందుకంటే...?

By Sandra Ashok Kumar  |  First Published Nov 4, 2019, 1:08 PM IST

2014లో నరేంద్రమోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గత ఐదేళ్లలో 26 ప్రభుత్వ బ్యాంకులకు చెందిన 3427 శాఖలు మూత పడ్డాయి. ఇటీవలి కాలంలో కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనంచేసిన ఫలితంగానే ఈ శాఖలు మూతపడ్డాయని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.


ఇండోర్‌: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు.. వందల శాఖలను కనుమరుగు చేస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిధిలో జరిగిన విలీనాల వల్ల ఆయా బ్యాంకులు 3,427 శాఖలను మూసేశాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద నీముచ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌడ్‌ దాఖలు చేసిన దరఖాస్తుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు వివరాలు అందజేసింది. 

మూతబడ్డ బ్యాంక్‌ శాఖల్లో 75% ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐకి చెందినవే కావడం గమనార్హం. భారతీయ మహిళా బ్యాంక్‌ (బీఎంబీ)తోపాటు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌ 2017 ఏప్రిల్‌ 1 నుంచి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)లో విలీనమైపోయిన విషయం తెలిసిందే. 

Latest Videos

also read ఇక లాంఛనమే ఐపీఓకు సౌదీ ఆరామ్‌కో.. వచ్చే నెల్లో లిస్టింగ్

కాగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 90 బ్యాంక్‌ శాఖలు మూతబడటం, విలీనమైపోవడం జరుగగా, 2015-16లో 126, 2016-17లో 253, 2017-18లో ఏకంగా 2,083, 2018-19లో 875 శాఖలకు తాళం పడింది. ఎస్బీఐలో బీఎంబీతోపాటు దాని ఐదు అనుబంధ బ్యాంకుల విలీనాల వల్ల మూతబడిన శాఖలే 2,568గా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీనం అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. మరో 10 బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా కేంద్ర మార్చనున్నదీ తెలిసిందే. దీంతో మూతబడే బ్యాంక్‌ శాఖల సంఖ్య మరింత పెరిగిపోనున్నది. 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కలిసిపోతుండగా, కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌లు విలీనమైపోతున్నాయి.

బ్యాంకుల విలీనంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. బ్యాంక్‌ శాఖలు తగ్గిపోయి ఉద్యోగుల పరిస్థితి ప్రమాదంలో పడుతున్నదని అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం ఆందోళన వెలిబుచ్చారు. మరో 10 బ్యాంకులు విలీనం కానున్నాయన్నారు. 

అది జరిగితే మూతబడే బ్యాంకుల సంఖ్య 7 వేలకు చేరుతుందని అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం పేర్కొన్నారు. చాలావరకు మెట్రో నగరాలు, ఇతర పట్టణాల్లోనే మూతబడుతున్నాయని తెలిపారు. అంతేగాక ఈ విలీనాలతో బ్యాంకుల వ్యాపారం కూడా తగ్గిపోతున్నదని మండిపడ్డారు.

also read దేశంలో ఇంత బంగారం ఉందా!

మరోవైపు బ్యాంకింగ్‌ రంగంలో జరుగుతున్న విలీనాలను ఆర్థికవేత్త జయంతీలాల్‌ భండారీ సమర్థించారు. భారీ బ్యాంకుల ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి లాభం చేకూరగలదని చెప్పారు. ప్రస్తుతం చిన్నతరహా బ్యాంకుల అవసరం లేదన్న ఆయన పెద్ద బ్యాంకులు అందుబాటులోకి వస్తే వాటి ఆర్థిక సామర్థ్యం పెరిగి సామాన్యులకు మరిన్ని రుణాలు వచ్చే వీలుందన్నారు. 

బ్యాంకింగ్‌ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) సమస్యకు పరిష్కారం కూడా లభించగలదన్న అభిప్రాయాల్ని మరికొందరు వినిపిస్తున్నారు. 

ప్రస్తుతం రుణ ఎగవేతదారులు ఒక బ్యాంక్‌ నుంచి మరొక బ్యాంక్‌కు సులభంగా వెళ్లగలుగుతున్నారని, బ్యాంకులు తగ్గితే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అంటున్నారు. తద్వారా మొండి బాకీలు తగ్గుతాయని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఇదే వాదనతో విలీనాలకు దిగుతున్నది తెలిసిందే.

click me!