హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్‌ కేంద్రం! ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి

Published : May 17, 2019, 10:24 AM IST
హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్‌ కేంద్రం! ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి

సారాంశం

వచ్చే అయిదేళ్లలో భారత్‌లో రూ.7000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని సంస్థ దక్షిణాసియా విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో మాస్టర్ కార్డ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.

హైదరాబాద్‌: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ అయిన ‘మాస్టర్‌కార్డ్‌’ మనదేశంలో వచ్చే ఐదేళ్లలో బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7,000 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. చెల్లింపుల సేవల విస్తరణ, సైబర్‌ భద్రతను పటిష్ఠం, ద్వితీయ-తృతీయ శ్రేణి పట్టణాలు, సెమీ అర్బన్‌ ప్రాంతాలకు డిజిటల్‌ చెల్లింపు సేవల విస్తరించటానికి, డేటా అనలిటిక్స్‌, ఆథెంటికేషన్‌, టోకెనైజేషన్‌ తదితర సేవలను పెంపొందించడానికి ఈ నిధులు ఖర్చు చేస్తామని మాస్టర్‌ కార్డ్‌ దక్షిణాసియా విభాగం సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఇప్పటికే మాస్టర్‌కార్డ్‌ గత ఐదేళ్లలో బిలియన్‌ డాలర్లు వెచ్చించిందని రాజీవ్‌ కుమార్‌ గురువారం మీడియాతో చెప్పారు. అనూహ్యంగా దేశంలో డిజిటల్‌ చెల్లింపుల జోరు పెరగుతోందని, అన్ని చిన్న పట్టణాలు, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లోనూ డిజిటల్‌ చెల్లింపుల వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటంతో డిజిటల్‌ లావాదేవీల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు.ప్రస్తుతం దేశంలో 2.5 కోట్ల మంది డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నట్లు, వచ్చే రెండేళ్లలో ఇది 12.5 కోట్లకు పెరగనుందని మాస్టర్‌ కార్డ్‌ దక్షిణాసియా విభాగం సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అదేవిధంగా ఎంఏపీ (మర్చంట్‌ యాక్సెప్టెన్స్‌ పాయింట్లు‌) సంఖ్య వచ్చే రెండేళ్లలో ఒక కోటికి  చేరనుందని, ప్రస్తుతం ఇది 52 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. తద్వారా డిజిటల్‌ చెల్లింపుల విభాగంలో దక్షిణ కొరియా, జపాన్‌, యూఎస్‌లను భారత్ అధిగమించినట్లవుతుందని రాజీవ్ కుమార్ అన్నారు.భారతదేశంలో మాస్టర్‌కార్డ్‌ కార్యకలాపాలు ఐదేళ్లలో బాగా పెరిగాయి. సిబ్బంది సంఖ్య 29 నుంచి 2000 మందికి పెరిగింది. బెంగళూరు, గుర్గావ్‌లలో మాస్టర్ కార్డ్ కొత్త కార్యాలయాలు వచ్చాయి. పుణెలో మాస్టర్‌కార్డ్‌ ల్యాబ్‌- ఆపరేషన్స్‌ హబ్‌ను నెలకొల్పారు. వడోదరాలో ఒక టెక్నాలజీ కేంద్రం ఏర్పాటైంది. ఇంతటితో ఆగకుండా ఇతర నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నట్లు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. దీనివల్ల సిబ్బంది సంఖ్య సమీప భవిష్యత్తులో 4000 మందికి పెరుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్‌ కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు సానుకూలంగా స్పందిస్తూ సమీప భవిష్యత్తులో ఇక్కడ తమ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నట్లుగా బదులిచ్చారు.‘ఆధార్’ నుంచి మాస్టర్‌కార్డ్‌ ఆథెంటికేషన్‌ సర్వీస్‌ ఏజెన్సీ (ఏఎస్‌ఏ) లైసెన్సు తీసుకున్నట్లు, దీనివల్ల ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ, ’-కేవైసీ సేవలు అందిస్తున్నామని, ఈ సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డీబీటీ లబ్దిదార్లకు అందిస్తున్నట్లు మాస్టర్ కార్డ్ దక్షిణాసియా సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఆర్థిక సేవల రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత పరిచేందుకు ప్రయత్నిస్తూ సరికొత్త సేవలు, ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకువస్తున్న స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో ‘మాస్టర్‌కార్డ్‌’ క్రియాశీలకంగా ఉన్నట్లు మాస్టర్ కార్డ్ దక్షిణాసియా సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. భాగంగా హైదరాబాద్‌కు చెందిన ‘సింటిజెన్‌’ అనే స్టార్టప్ సంస్థలో పెట్టుబడి పెట్టినట్లు మాస్టర్ కార్డ్ దక్షిణాసియా సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇదేకాకుండా రేజర్‌పే, జెటా, టోన్‌ట్యాగ్‌, ఫ్లూయిడ్‌ ఏఐ, హ్యాపే, సైన్‌జై, ఎఫ్‌టీక్యాష్‌ అనే సంస్థలకు పెట్టుబడి సమకూర్చినట్లు తెలిపారు. ఈ ఏడాది మరో రెండు స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని, అందులో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు ఉండవచ్చని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్