
మన దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న ఏకైక విభాగం పోస్టాఫీసు అనే చెప్పాలి. పోస్టల్ సర్వీసుగా మాత్రమే కాదు, పోస్టాపీసులు బ్యాంకింగ్ సేవలు అందించడంలో కూడా ముందు వరుసలో నిలుస్తున్నాయి. ముఖ్యంగా చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పోస్టాఫీసు (Post office)లు అందించే సేవింగ్స్ స్కీమ్స్ చాలా ఉపయోగ పడుతుంటాయి. పేద మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని పోస్టాఫీసులో అనేక సేవింగ్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(MIS), టైమ్ డిపాజిట్లు(TD), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్(SCSS) చాలా ముఖ్యమైనవి. ఈ పథకాల్లో పొదుపు చేయడం ద్వారా కస్టమర్లు వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతారు. అయితే ఈ వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా కూడా చేసుకునే ఇంత వరకూ అందుబాటులో ఉంది. కాగా ఈ వడ్డీ ఆదాయాన్ని విత్ డ్రా చేసుకోవడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన సర్క్యలర్ మేరకు 2022 ఏప్రిల్ 1 నుంచి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌కు సంబంధించిన వడ్డీ ఆదాయం ఇకపై, సంబంధిత పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ లేదా ఏదైనా బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేస్తామని పోస్టల్ శాఖ ప్రకటించింది.
ఏప్రిల్ 1, 2022 నుండి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(MIS), టైమ్ డిపాజిట్లు(TD), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్(SCSS) లాంటి సేవింగ్స్ స్కీమ్‌లపై వచ్చే వడ్డీ కేవలం పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా లేదా స్కీమ్‌కి లింక్ చేసిన ఖాతాదారుడి బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ అవుతుందని డిపార్ట్‌మెంట్ తెలిపింది.
మార్చి 31లోగా ఖాతా లింక్ కాకపోతే...
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ జారీ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారం, “01.04.2022 నుండి అమలులోకి వచ్చేలా MIS/SCSS/TD ఖాతాలపై వడ్డీ కేవలం పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా లేదా ఖాతాదారు బ్యాంక్ ఖాతాకు మాత్రమే జమ చేయబడుతుంది. ఖాతాదారుడు 31.03.2022 నాటికి పొదుపు ఖాతాను MIS/SCSS/TD ఖాతాలతో లింక్ చేయలేకపోతే, అప్పుడు బకాయి ఉన్న ఔట్ స్టాండింగ్ వడ్డీ ఆదాయాన్ని పోస్టాఫీసు పొదుపు ఖాతా, చెక్ ద్వారా మాత్రమే చెల్లిస్తామని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది .1 ఏప్రిల్ 2022 నుండి MIS/SCSS/TD ఇతర కార్యాలయ ఖాతా నుండి నగదు రూపంలో వడ్డీ చెల్లింపు అనుమతించబడదు.
పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతాను ఎలా లింక్ చేయాలి
MIS/SCSS/TD ఖాతాలతో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాను లింక్ చేయడానికి, ఖాతాదారుడు పోస్ట్ ఆఫీస్‌లో ఫారమ్ SB-83ని సమర్పించాలి. ఇది కాకుండా, MIS, SCSS, TD ఖాతా పాస్‌బుక్ మరియు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా పాస్‌బుక్ కూడా వెరిఫికేషన్ కోసం తీసుకెళ్లాలి. బ్యాంక్ ఖాతాను లింక్ చేయాలంటే, ఖాతాదారు ECS-1 ఫారమ్‌ను సమర్పించాలి. రద్దు చేసిన చెక్కుతో పాటు బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ మొదటి పేజీ కాపీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. MIS, SCSS, TD ఖాతా పాస్‌బుక్‌ని కూడా తీసుకెళ్లండి. లింక్ చేయాల్సిన పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతా సింగిల్ లేదా జాయింట్‌లో ఉండవచ్చని పోస్టల్ శాఖ కూడా చెబుతోంది.
MIS/SCSS/TD ఖాతాలతో పొదుపు ఖాతాను లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
>> MIS/SCSS/TD ఖాతా నుండి వడ్డీని నేరుగా ఉపసంహరించుకోకపోతే, పొదుపు ఖాతాలో క్రెడిట్ చేయబడిన వడ్డీపై అదనపు వడ్డీ లభిస్తుంది.
>> పోస్టాఫీసును సందర్శించకుండానే వివిధ ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా వడ్డీని ఉపసంహరించుకోవచ్చు.
>> వివిధ ఉపసంహరణ ఫారమ్‌లను పూరించాల్సిన అవసరం లేదు.
>> MIS/SCSS/TD ఖాతాల నుండి వడ్డీ స్వయంచాలకంగా క్రెడిట్ చేయబడుతుంది.
>> డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, మనీలాండరింగ్ కార్యకలాపాలను నిరోధించడం మరియు మోసాలను నివారించడానికి ఒక నిరోధక చర్యగా కాంపిటెంట్ అథారిటీ పేర్కొంది. దీని కోసం, సర్కిల్‌లు ప్రత్యేక డ్రైవ్‌లను అమలు చేస్తాయి.