Price Hikes: పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. సామాన్యులకు ఇక కష్టమే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 21, 2022, 04:27 PM ISTUpdated : Mar 21, 2022, 04:33 PM IST
Price Hikes: పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. సామాన్యులకు ఇక కష్టమే..?

సారాంశం

ఇప్పటికే శ్రీలంకను ద్రవ్యోల్బణం దహించి వేస్తోంది. కొండెక్కి కూర్చున్న ధరలతో అక్కడి ప్రజలకు పూట గడవడమే కష్టంగా మారుతోంది. ప్రస్తుతం భారత్‌లోనూ అదే పరిస్థితి నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.   

సామాన్యులపై మరోసారి ధరల భారం పడనుంది. ఈ సారి వారికి షాక్ ఇచ్చేందుకు ఎఫ్ఎంసీజీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరుగుతున్నందున తప్పని స్థితిలో ధరలు పెంచే దిశగా అవి అడుగులు వేస్తున్నాయి. ప్రతి ఇంట్లో రోజు వారీ వినియోగించే గోధుమలు, వంటనూనెలు (Cooking Oil), ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు అమాంతం 10 శాతం మేర పెరగనున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పెంపు నిర్ణయం తప్పటంలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్నాక్స్ తయారీలో ముడిపదార్థాల ధరల పెరుగుదల ఈ పెంపుకు మరో కారణంగా నిలిచిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. గోధుమ, నూనె, చమురు ధరలు భారీగా పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో ధరల పెంపు తప్పనిదని ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. 

తాము 10 శాతం నుంచి 15 శాతం వరకు ఇండస్ట్రీ గ్రోత్‌ను అంచనావేస్తున్నామని పార్లె ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా అన్నారు. కమోడిటీ ధరలలో తీవ్ర అనిశ్చితకర పరిస్థితులున్నాయని, అయితే ధరల పెంపు కచ్చితంగా ఏ మాత్రం ఉంటుందో ఇప్పుడు చెప్పడం కష్టమేనని అన్నారు. పామాయిల్ ధరలు లీటరు రూ.180 పెరిగి.. ప్రస్తుతం రూ.150కి దిగొచ్చాయి. అలాగే క్రూడాయిల్ ధరలు బ్యారల్ 140 డాలర్లను చేరుకుని, ప్రస్తుతం 100 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ముడిసరుకుల ధరలలో తీవ్ర అనిశ్చితి ఉండటంతో.. ధరల పెంపులు కూడా ఏ మాత్రం ఉంటాయన్నది కంపెనీలు చెప్పేందుకు ఇష్టపడుట లేదు. అయితే ఖర్చులు అధికంగా ఉండటంతో... 10 శాతం నుంచి 15 శాతం మధ్యలో ధరల పెంపు ఉంటుందని మాత్రం తెలుస్తోంది.

ద్రవ్యోల్బణం ప్రస్తుతం అత్యధిక స్థాయిలోనే ఉందని.. వరుసగా రెండో ఏడాది ఇది ఆందోళనకరంగా మారిందని డాబర్ ఇండియా ఫైనాన్సియల్ చీఫ్ అంకుష్ జైన్ అన్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ప్రజలు ఖర్చులు తగ్గించారని, కేవలం చిన్న ప్యాక్‌లను మాత్రమే కొంటున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను తాము క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో తాము కూడా ధరలను కాస్త పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హెచ్‌యూఎల్ తన ప్రొడక్ట్‌లపై ధరలను పెంచింది. మార్చి 14 నుంచి బ్రూ కాఫీ ధరలు 3 శాతం నుంచి 7 శాతం వరకు పెరిగాయి. అలాగే బ్రూ గోల్డ్ కాఫీ ధరలు కూడా 3 శాతం నుంచి 4 శాతం, ఇన్‌స్టాంట్ కాఫీ పౌచస్ ధరలు 7 శాతం వరకు, తాజ్ మహల్ టీ ధరలు 3.7 శాతం నుంచి 5.8 శాతం వరకు వరకు పెరిగాయి. నెస్లే ఇండియా కూడా తన మ్యాగీ ప్యాకెట్ల ధరలను పెంచింది. అంతకుముందు రూ.12గా ఉన్న ప్యాకెట్ ధరను రూ.14గా చేసింది.

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే