దటీజ్ ఆనంద్ మహీంద్రా.. అందుబాటులో చౌకగా వెంటిలేటర్!

By narsimha lodeFirst Published Mar 27, 2020, 12:40 PM IST
Highlights

కరోనా మహమ్మారిపై పోరులో తనవంతు సహకారం అందిస్తామని ప్రకటించిన మహీంద్రా గ్రూప్‌ ఆ దిశగా తొలి అడుగు వేసింది. రూ.7,500కే అధునాతన వెంటిలేటర్‌ అందించేందుకు సన్నద్ధం అవుతున్నామని తెలిపింది


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో తనవంతు సహకారం అందిస్తామని ప్రకటించిన మహీంద్రా గ్రూప్‌ ఆ దిశగా తొలి అడుగు వేసింది. రూ.7,500కే అధునాతన వెంటిలేటర్‌ అందించేందుకు సన్నద్ధం అవుతున్నామని తెలిపింది. ఈ మేరకు సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా వేర్వేరు ట్వీట్లలో వెంటిలేటర్ తయారు చేసిన సంగతి వెల్లడించారు.

అంబు బ్యాగ్‌గా పిలిచే ఆటోమేటెడ్‌ వెర్షన్‌ వాల్వ్‌ మాస్క్‌ వెంటిలేటర్‌ నమూనాను రూపొందించామని పేర్కొంది.  మూడు రోజుల్లో దానిని తయారు చేసేందుకు అనుమతులు లభించే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ పేర్కొంది.

‘‘కొవిడ్‌పై పోరులో భాగంగా దేశీయ ఐసీయూ వెంటిలేటర్ల తయారీ సంస్థతో కలిసి పనిచేస్తున్నాం. అధునాతన మెషిన్ల ఖరీదు సుమారు రూ.5 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. మా బృందం రూపొందించిన ఈ వెంటిలేటర్‌ సుమారు రూ.7,500 మాత్రమే అవుతుందని అంచనా వేస్తున్నాం’’ అని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. దీన్ని రూపొందించిన బృంద సభ్యులకు ధన్యవాదాలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

దేశంలో వెంటిలేటర్ల కొరతను అధిగమిచేందుకు వెంటిలేటర్ల తయారీ సంస్థతో పాటు రెండు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గొయెంకా ట్వీట్‌ చేశారు. మరోవైపు తమ బృందం అంబు బ్యాగ్‌ రూపకల్పనలో పనిచేస్తోందని తెలిపారు. 

also read:ఎయిర్ టెల్, జియో టూల్స్: కరోనా టెస్టులు చేయండిలా...

మూడు రోజుల్లో అనుమతులు వస్తాయని భావిస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ఒకసారి వచ్చాక తయారీకి వీలు కలుగుతుందని వివరించారు. కొవిడ్‌పై పోరాడేందుకు వెంటిలేటర్లను తయారుచేస్తామని ఆదివారం ఆనంద్‌ మహీంద్రా ప్రకటించిన విషయం తెలిసిందే.

మహీంద్రా అండ్ మహీంద్రా రూపొందించిన ఈ వెంటిలేటర్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్ కలిగి ఉంటుంది. ప్రొటోటైప్ ఆటోమేటెడ్ వర్షన్‌తో దీన్ని తీర్చి దిద్దారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆనంద్ మహీంద్రా తెలిపారు. వెంటిలేటర్లను తయారు చేసేందుకు వ్యక్తుల నుంచి వస్తున్న మద్దతు ఆనందంగా ఉన్నదన్నారు. 
 

click me!