
అనుకున్నట్లుగానే జరిగింది. అందరి అంచనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బాదుడు ప్రారంభించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయని అందరు భావించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అలానే చేసింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుందని చెప్పుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది.
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరకు ఈ పెంపు వర్తిస్తుంది. మార్చి 22 నుంచే రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కాగా చివరిగా 2021 అక్టోబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అప్పటి నుంచి వంట గ్యాస్ ధర నిలకడగానే వచ్చింది. దీనికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎన్నికలు ముగియడంతో కేంద్రం ధరలు పెంచేసింది.
దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు మంగళవారం నుంచి పెరిగాయి. ఢిల్లీ, ముంబై, ఇతర నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు 50 రూపాయలకుపైగా పెరిగాయి.పెట్రోల్, డీజిల్ తర్వాత దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది.ఇప్పుడు ఢిల్లీ, ముంబైలలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.949.50కు పెరిగింది. కోల్‌కతాలో వినియోగదారుడు సిలిండరుకు రూ.976 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో రూ.965.50లు, లక్నోలో రూ.987.50కి పెంచారు.పాట్నాలో కూడా ధరలు పెంచారు. పాట్నాలో ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ. 1,039.50కి విక్రయిస్తున్నారు.
హైదరాబాద్‌లో అయితే సిలిండర్ ధర రూ.1,002కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలుపుకుంటే సిలిండర్ ధర రూ.1032 అయ్యిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏపీలో అయితే సిలిండర్ ధర రూ.1008కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకనే చార్జీలు కలుపుకుంటే సిలిండర్ పొందాలంటే రూ.1040 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.1000 పైకి తీసుకెళ్లింది. 2021 అక్టోబర్ నుంచి సిలిండర్ ధరలో మార్పు లేదు. అయితే అప్పటి నుంచి చూస్తే ముడి చమురు ధరలు మాత్రం భారీగా పెరిగాయి. అయినా కూడా సిలిండర్ ధర పెరగలేదు. కానీ ఇప్పుడు ధరలు పెరిగాయి. కాగా సిలిండర్ ధరలపై అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు, రూపాయి మారక విలువ వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి.