
LPG Gas Subsidy: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో పాటుగా, నిత్యవసరాల ధరలతో పాటు వంట గ్యాస్ ధర కూడా భారీగా పెరిగింది. ఇక LPG గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రూ.1000ల సమీపానికి చేరుకుంది. పెరుగుతున్న నిత్యవసర సరుకులతోపాటు గ్యాస్ సిలిండర్ సామాన్యులకు భారంగా మారింది. అంతేకాదు అటు ప్రభుత్వం ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ కూడా లభించకపోవడంతో పేద, మధ్య తరగతి వర్గాల్లో మరింత అసంతృప్తి పెరిగింది.
అయితే ఇప్పుడు గ్యాస్ సబ్సిడీపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా నిలిచి పోయిన గ్యాస్ సబ్సిడీని తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని దేశం మొత్తం అందించేందు ప్రణాళిక చేస్తోంది.
ప్రభుత్వం అంతర్గత నివేదిక అంచనా ప్రకారం, కొందరు వినియోగదారులు సిలిండర్ కోసం 1000 రూపాయల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది. అందుకే LPG సిలిండర్ల విషయంలో ప్రభుత్వం రెండు వైఖరిని తీసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వం సబ్సిడీ లేకుండా సిలిండర్లను సరఫరా చేయడంతో పాటు. రెండవది, కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనం ఇవ్వాలని ప్రణాళిక రచిస్తోంది.
సబ్సిడీపై ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి?
సబ్సిడీ ఇవ్వడంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రూ.10 లక్షల ఆదాయం అనే నిబంధన అమలులో ఉంటుందని, ఉజ్వల పథకం లబ్ధిదారులు సబ్సిడీ ప్రయోజనం పొందుతారని తెలిపారు.
ప్రభుత్వం రాయితీపై ఎంత ఖర్చు చేస్తోంది
2020 ఆర్థిక సంవత్సరంలో సబ్సీడీలపై ఖర్చు చేసిన వ్యయం రూ.24,468 కోట్లుగా ఉంది. జనవరి 2015లో ప్రారంభించబడిన DBT పథకం కింద LPG గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ మొత్తం అందిస్తున్నారు. దీని కింద వినియోగదారులు సబ్సిడీ లేని LPG సిలిండర్ పూర్తి మొత్తాన్ని మొదట చెల్లించాలి. అదే సమయంలో, సబ్సిడీ డబ్బును ప్రభుత్వం కస్టమర్ బ్యాంక్ ఖాతాకు తిరిగి చెల్లిస్తుంది.
గ్యాస్ సిలిండర్ ధర రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది అంటే 2021లో గ్యాస్ సిలిండర్ ధర నిరంతరం పెరుగుతూనే ఉంది. కొత్త సంవత్సరంలో దేశీయ గ్యాస్ ధరపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.
గ్యాస్ సబ్సిడీ రావాలంటే ఈ పని తప్పనిసరి..
గ్యాస్ సబ్సిడీని పొందడానికి మీ గ్యాస్ కనెక్షన్ ను మీ ఆధార్ నంబర్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు మీ గ్యాస్ డీలర్‌షిప్ సంప్రదించాల్సి ఉంటుంది. ఆధార్‌ను లింక్ చేసిన తర్వాత మీరు మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సబ్సిడీ నగదు జమ అయిన మీ మొబైల్ ఫోన్ కు సందేశం కూడా వస్తుంది.
మొబైల్ నెంబర్ తో గ్యాస్ కనెక్షన్‌ని ఎలా లింక్ చేయాలి..
ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ని మొబైల్‌తో లింక్ చేయడానికి, మీ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించండి. అక్కడ మీరు మొబైల్‌తో గ్యాస్ కనెక్షన్‌ని లింక్ చేసే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, మీ LPG ID నెంబరును నమోదు చేయాలి. ఆ తర్వాత వెరిఫై చేసి సబ్మిట్ చేయండి. బుకింగ్ తేదీతో సహా అన్ని ఇతర సమాచారాలను పూరించాలి. దీని తర్వాత మీరు సబ్సిడీకి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.